Categories: LATEST UPDATES

సుచిరిండియా క్ల‌బ్‌హౌజ్ సీజ్‌

హెచ్ఎండీఏ అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చివేసే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా చేప‌డుతోంది. సోమవారం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) సంయుక్తంగా మణికొండ మున్సిపాలిటీ, తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయ‌గా మ‌రికొన్ని సీజ్ చేశారు.

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడ సర్వే నంబర్ 115లో ఎలాంటి అనుమతులు లేకుండా స్లిట్ + ఐదు(5) అంతస్తుల భవనం స్లాబ్ లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది కట్ చేశారు. నెక్నంపూర్ లో 277 చదరపు గజాల స్థలంలో అక్రమంగా నిర్మించిన గ్రౌండ్ + ఐదు అంతస్తుల (జి+5) భవనంతో పాటు 250 చదరపు గజాల స్థలానికి గ్రౌండ్ + రెండు అంతస్తులకు అనుమతిని తీసుకుని దానిపై అక్రమంగా మరో మూడు అంతస్తులు, పెంట్ హౌస్ నిర్మాణాలు ఉన్న భవనం పైఅంతస్తుల స్లాబ్ లను టాస్క్ ఫోర్స్ కూల్చివేసింది. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో సుచిర్ ఇండియా సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన క్లబ్ హౌస్, ఫామ్ హౌస్ లను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. హైద‌రాబాద్‌లోనే టాప్ డెవ‌ల‌ప‌ర్ అయిన వాస‌వి గ్రూపుతో క‌లిసి సుచిరిండియా సంస్థ.. వాస‌వి ఆర్య‌వ‌ర్త న‌గ‌రి అనే వెంచ‌ర్‌ని తూముకుంట‌లో డెవ‌ల‌ప్ చేస్తోంది. సుమారు ఎన‌భై ఎక‌రాల్లో విస్త‌రించిన ఈ ప్రాజెక్టుకు రెరా అనుమ‌తి కూడా ఉంది. దాదాపు 742 యూనిట్ల‌ను అమ్మ‌కానికి పెట్టింది. ఒక్కో ప్లాటును 1721 నుంచి 34,369 చ‌ద‌ర‌పు అడుగుల్లో విక్ర‌యిస్తోంది. సంస్థ లేఅవుటుకు అనుమ‌తి తీసుకున్న‌ది కానీ ఇందులో క్ల‌బ్ హౌజ్ వంటి నిర్మాణాల‌కు అనుమ‌తి తీసుకోనందు వ‌ల్లే క్ల‌బ్ హౌజును సీజ్ చేశారా? లేక ఇత‌ర కార‌ణాల వ‌ల్ల చేశారా అనే అంశాన్ని హెచ్ఎండీఏ అధికారులు వెల్ల‌డించ‌లేదు.

This website uses cookies.