Categories: LATEST UPDATES

పీఎంజీవై ఇళ్ల కేటాయింపులో ఎలాంటి వివక్షా లేదు

* కేంద్రం స్పష్టీకరణ

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకం కింద ఇళ్ల కేటాయింపులో రాష్ట్రాలపై ఎలాంటి వివక్షా చూపించడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సమాధానమిచ్చారు. అలాగే కర్ణాటకకు ఇలాంటి ఇళ్లు ఇప్పటివరకు ఇవ్వనందున ఆ రాష్ట్రం నుంచి లబ్ధిదారుల వివరాలను ఆవాస్ ప్లస్ పోర్టల్ లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. తుఫాను వల్ల ప్రభావితమైన ఒడిశాకు కూడా మరో అవకాశం ఇవ్వాలని, లబ్ధిదారుల పేర్లను సైట్ లో నమోదు చేసేందుకు వీలుగా ఆవాస్ ప్లస్ వెబ్ సైట్ ను తెరిచి ఉంచాలని బీజేపీ ఎంపీ భాతృహరి మహతాబ్ కోరారు. ‘ఒడిశా తొలి నుంచీ మా వెబ్ సైట్ కు అనుసంధానం అయి ఉంది. ఇప్పటివరకు ఒడిశాకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చాం. వారు 14 జిల్లాల వివరాలు నమోదు చేశారు. మేం ఎవరి పట్లా వివక్ష చూపించం’ అని మంత్రి గిరిరాజ్ స్పష్టంచేశారు. గత ఏడేళ్లలో ఈ పథకం కింద విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలతో 2.46 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చామని పేర్కొన్నారు. ప్రాథమిక సౌకర్యాలతో మొత్తం 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించారు. 1985 నుంచి 2014 మధ్య కాలంలో సగటున ఏడాదికి 11.21 లక్షల ఇళ్లు నిర్మించగా.. మోదీ హయాంలో ఏటా 35.19 లక్షల ఇళ్లు కట్టినట్టు చెప్పారు.

This website uses cookies.