* విజయవంతంగా ముగిసిన మూడు రోజుల అతిపెద్ద సదస్సు * తదుపరి సదస్సు 2024లో భోపాల్ లో నిర్వహణ
దేశీయ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్టుల అతిపెద్ద మూడు రోజుల జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఇండియన్ సొసైటీ ఆఫ్ ల్యాండ్ స్కేప్ ఆర్టిటెక్ట్స్ (ఐఎస్ఓఎల్ఏ) 14వ జాతీయ సదస్సులో దేశ విదేశాలకు చెందిన 750 మందికి పైగా ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్టులు, వాస్తు శిల్పులు, ప్లానర్లు, డిజైనర్లు, పర్యావరణ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ‘అన్ బిల్డ్ ల్యాండ్ స్కేప్‘ అనే థీమ్ తో ఐఎస్ఓఎల్ఏ గౌరవ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవిరావు హోమ్ చాప్టర్ అయిన ఐఎస్ఓఎల్ఏ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. బ్యాంకాంక్ కు చెందిన ల్యాండ్ ప్రాసెస్ అండ్ పోరస్ సిటీ నెట్ వర్క్ ఫౌండర్, సీఈఓ కోట్చకోరన్ వోరాఖోమ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈమె థాయ్ ల్యాండ్ లోని అత్యుత్తమ ఆర్టిటెక్టుల్లో ఒకరిగా పేరు పొందారు. అలాగే మోహన్ ఎస్ రావు, ప్రిన్సిపల్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ డిజైన్ (ఐఎన్ఢీఈ) ఇండియా కూడా మాట్లాడారు. ఆగ్నేయాసియాలో నిష్క్రియ నీటి నిర్వహణ, పరిరక్షణ వ్యూహాలలో ప్రముఖ నిపుణుడిగా ఈయన గుర్తింపు పొందారు.
ఇక నెదర్లాండ్స్ కు చెందిన అర్బన్ డిజైనర్, డీఈ అర్బనైస్టన్ ఫౌండర్, డైరెక్టర్ డిర్క్ వాన్ పీజ్పే, స్పెయిన్ లోని ఇజ్రాయెల్ అల్బా ఎస్టూడియో ఫౌండర్, డైరెక్టర్ ఇజ్రాయెల్ అల్బా, అమెరికాలోని ససాకి ప్రిన్సిపల్ ల్యాండ్ స్కేప్ ఆర్టిటెక్ట్ మైఖేల్ గ్రోవ్, ఓయికోస్ ఇండియా ఫౌండర్ కేతకి ఘాటే, క్షేత్ర ఇండియా ఫౌండర్ జీఎస్వీ సూర్యనారాయణ మూర్తి తదితరులు కూడా సదస్సులో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తమ ప్రాజెక్టుల్లో నీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పారు. ఇక రెండవ రోజు ప్రజెంటేషన్ లో ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ పాత్ర ఎలా ఉంటుందో పలువురు విశదీకరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా నగరాలను ఎలా డిజైన్ చేయాలి, ఆహార వ్యవసాయానికి మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మెట్ల బావుల గురించి కూడా ఈ వర్క్ షాపులో ప్రస్తావించారు. మూడు రోజుల ఈ అతిపెద్ద సదస్సు విజయవంతంగా ముగిసిన నేపథ్యంతో తదుపరి సదస్సును 2024లో భోపాల్ లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఐఎస్ఓఎల్ఏ గురించి..
ఇండియన్ సొసైటీ ఆఫ్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్స్ (ఐఎస్ఓఎల్ఏ) అనేది ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్టుల వృత్తిపరమైన సంస్థ. 19 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంస్థలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 360 మందికి పైగా సభ్యులతోపాటు ప్రపంచవ్యాప్తంగా కొందరు ఆర్కిటెక్టులు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ల్యాండ్ స్కేప్ ఆర్టిటెక్చర్ గురించి అవగాహన కల్పించడం.. సంస్థ సభ్యులలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని మెరుగుపరచడం వంటి విషయాల్లో ఐఎస్ఓఎల్ఏ కీలకపాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్స్ సమాఖ్యలో ఐఎస్ఓఎల్ఏకి సభ్యత్వం కూడా ఉంది.