ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రీలాంచ్ కేటుగాళ్ల బారి నుంచి అమాయక కొనుగోలుదారుల్ని కాపాడేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తున్న సంస్థల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను ప్రచురించాలని రెరా అథారిటీకి ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవల చేవేళ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో స్క్వేర్ యార్డ్స్ ఫ్యాక్టరీ సంస్థ బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఈ కంపెనీ సుమారు ఐదు వెంచర్లను ప్రీలాంచులో విక్రయిస్తుందని.. అందులో సామాన్య ప్రజానీకం ఫ్లాట్లను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అందులో సంస్థ ఫోన్ నెంబర్లనూ వెల్లడించింది. ఇదే క్రమంలో ఇతర సంస్థలకు సంబంధించిన పేర్లను విడుదల చేయడానికి రెరా సమాయత్తం అవుతోందని సమాచారం.
హైదరాబాద్‌లో తెలంగాణ రెరా అథారిటీ ఏర్పాటయ్యాక.. రెరా అనుమతి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించడం నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా చేసినా.. ఆ సంస్థ మీద లేఅవుట్/ ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను విధిస్తారు. ఇప్పటివరకూ రెరా అథారిటీ నగరంలోని సుమారు యాభైకి పైగా సంస్థలకు నోటీసుల్ని అందజేసింది. అందులో కొన్ని సంస్థలు రెరా అథారిటీకి సమాధానాల్ని పంపించాయి. మరికొన్ని కంపెనీలేమో పెద్దగా పట్టించుకోలేదు. ఇంకొన్ని సంస్థలు ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించి.. ఆ తర్వాత ఏదోరకంగా రెరా అనుమతిని తీసుకోవడం విశేషం. అరబిందో రియాల్టీ సంస్థ కొండాపూర్‌లో ఆరంభించిన రీజెంట్ ప్రాజెక్టును ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించింది. ఆతర్వాత రెరా అనుమతిని తీసుకుంది. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇదే విధానంలో ఫ్లాట్లను విక్రయించింది. మరి, ఈ కంపెనీ మీద రెరా అథారిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్‌లో ప్రీలాంచ్ రాజా ఎవరంటే? భువనతేజా అని చాలామంది చెబుతారు. ఎందుకంటే ఈ సంస్థ గతంలో అపార్టుమెంట్లను నిర్మించిన అనుభవం లేదు. అయినా తక్కువ రేటులో ఫ్లాట్లు అంటూ ప్రజల్ని బోల్తా కొట్టించింది. రూ. 12 నుంచి 16 లక్షలకే శామీర్ పేట్‌లో ఫ్లాట్లను విక్రయించింది. ఈ విషయం తెలిసిన రెరా అథారిటీ నోటీసుల్ని జారీ చేసింది. అయినా, సంస్థ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఇదొక్కటే కాదు.. ఇలాంటి అనేక సంస్థల వద్ద ఫ్లాట్లను కొనుగోలు చేయకూడదని రెరా అథారిటీ పత్రికా ప్రకటనను విడుదల చేసే అవకాశముంది. ఆర్‌జే గ్రూప్, జయ గ్రూప్, ఐరా రియాల్టీ, సుహాస్ ప్రాజెక్ట్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి పలు కంపెనీలకు సంబంధించి రెరా పత్రికా ప్రకటన విడుదల చేస్తారని సమాచారం.
మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హఠాత్తుగా ఏపీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు వారంలోనే ఆయన రెరాకు సంబంధించిన పలు కీలకమైన నిర్ణయం సమాచారం. దీని ప్రకారం.. రెరా అనుమతి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లను రిజిస్టర్ చేయకూడదని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాస్తారు. అదేవిధంగా, రెరా అనుమతి లేకుండా ఎవరు వెంచర్ వేసినా.. అందులోని సరిహద్దు రాళ్లను స్థానిక సంస్థలే తొలగించాలి. ఇందుకు సంబంధించి తెలంగాణ పురపాలక శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. రెరా అనుమతి తీసుకోకుండా ఇక నుంచి ఎవరు ఫ్లాట్లను అమ్మినా ఆయా బిల్డర్ల లైసెన్సులను రద్దు చేయాలని తెలియజేస్తుంది. మరి, సోమేష్ కుమార్ స్థానంలో కొత్త సీఎస్ రావడంతో.. తను రెరా అథారిటీపై దృష్టి సారిస్తారా? ఈ కీలకమైన విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారా? ప్రీలాంచ్ అమ్మకాల్ని అరికడతారా? మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేస్తారా? వంటి అంశాల గురించి తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
This website uses cookies.