ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెరా అథారిటీ ఛైర్ పర్సన్ ను ఎంపిక చేసే కసరత్తను ఆరంభించింది. ఈ మేరకు రెరా ఛైర్ పర్సన్, ఫుల్ టైమ్ సభ్యులను నియమించేందుకు పురపాలక శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు నెల దాకా గడువునిచ్చింది. ఫిబ్రవరి 17లోపు అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. అయితే, అంతకంటే ముందే ఈ ప్రక్రియను సజావుగా జరిపేందుకు ప్రభుత్వం సెలక్షన్ కమిటీని నియమించింది. రెరా చట్టం ప్రకారం.. ఇందులో తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టీస్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, లా సెక్రటరీ వంటివారు సభ్యులుగా ఉన్నారు.
ఛైర్ పర్సన్‌గా అర్హులెవరు?
పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, సాంకేతిక నైపుణ్యం.. ప్రణాళిక, లా, కామర్స్, పారిశ్రామిక, మేనేజ్‌మెంట్, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు లేదా నిర్వహణలో దాదాపు ఇరవై ఏళ్ల అనుభవం ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్న వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా అదనపు కార్యదర్శి పదవిని నిర్వహించిన అనుభవమున్నా.. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అందుకు సమానమైన పోస్ట్ నిర్వహించిన వ్యక్తులు రెరా చైర్ పర్సన్‌కు అర్హులు. వయసు 65 ఏళ్లలోపు ఉండాలి. మరో ఐదేళ్ల సర్వీసు అయినా ఉండాలి.
ఎంపికైన వ్యక్తి సుమారు ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు. నెల జీతం.. సుమారు రూ.లక్షన్నర.. అదనపు అలవౌన్సులు కింద దాదాపు రూ.50 వేల వరకూ ఉంటుంది.
రెరా నిబంధనల ప్రకారం.. అథారిటీ, అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సభ్యుల నియామకానికి తొలుత సెర్చ్ కమిటీని నియమించాలి. ఈ కమిటీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలి. అభ్యర్థులను షాట్ లిస్ట్ చేసి.. ఇద్దరు అభ్యర్థుల పేర్లను సెలక్ట్ కమిటీకి ప్రతిపాదించాల్సి ఉంటుంది. కానీ, తెలంగాణ రెరా అథారిటీ సెర్చ్ కమిటీ లేకుండానే.. నేరుగా సెలక్షన్ కమిటీని నియమించింది. ఈ కమిటీయే ప్రస్తుతం రెరా ఛైర్ పర్సన్, ఇతర సభ్యుల నియామక ప్రక్రియను చేపట్టింది.