- తెలుగు ఎన్నారైల ఎంపిక ఇదే
హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న భూముల ధరలు ఇక్కడి రియల్ పరిశ్రమకు మంచా చెడా అనే అంశంపై ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎకరం ధర ఏకంగా వంద కోట్లు దాటడం హైదరాబాద్ పరపతికి నిదర్శనమంటూ ప్రభుత్వ పెద్దలు సంబరంగా వ్యాఖ్యలు చేయగా.. ఇలాంటి పరిస్థితి మధ్యతరగతి సొంతింటి కలలను ఛిద్రం చేస్తామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ హైదరాబాద్ వైపు మొగ్గు చూపిన తెలుగు ఎన్నారైలు తమ మనసును మార్చుకున్నారని తెలిసింది.
ఇక్కడ పెరిగిపోతున్న భూముల ధరలు వారిని ఆలోచనలో పడేశాయి. దీంతో హైదరాబాద్ వద్దని.. టెక్సాస్ ముద్దని కొత్త పల్లవి అందుకున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ తో పోలిస్తే టెక్సాస్ లో భూముల ధరలు పదో వంతు తక్కువ కావడంతో అక్కడే ప్రాపర్టీ కొనుగోళ్లకు తెలుగు ఎన్నారైలు మక్కువ చూపిస్తున్నారని సమాచారం. అలాగే డల్లాస్, ఆస్టిన్ లలో కూడా హైదరాబాద్ కు సమానమైన వాతావరణం, మంచి పని-జీవన సమతుల్యత, చక్కని కనెక్టివిటీ కలిగి ఉన్నాయి. దీంతో చాలామంది ఇక్కడి ప్రాపర్టీ కొనుగోళ్లకే ఆసక్తి కనబరుస్తున్నారని తెలిసింది.