అన్నిరకాల అగ్రిమెంట్లు ఆన్‌లైన్‌లోనే
నోటరీ డాక్యుమెంట్లపై స్పెషల్ డ్రైవ్
నోటరీ డాక్యుమెంట్ వ్యాలిడేట్ చేయనున్న సర్కారు
తెలంగాణ సర్కార్ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే పనిలో పడింది. ఈ మేరకు ఈ-రిజిస్ట్రేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దం చేసింది. నోటరీ డాక్యుమెంట్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. వాటిని వ్యాలిడేట్ చేసి రిజిస్ట్రేషన్లు చేయాలని భావిస్తోంది. ఇకపై అన్ని రకాల అగ్రిమెంట్లు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చి.. రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచుకునేలా కసరత్తు చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ-రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. మరీ ముఖ్యంగా స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగాన్ని అధికారులు పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే నోటరీ చేసుకుని రిజిస్ట్రేషన్ కాని డాక్యుమెంట్లపై రేవంత్ సర్కార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. రిజిస్ట్రేషన్ చేసుకోని డాక్యుమెంట్లపై స్టాంప్ డ్యూటీ తీసుకుని, ఆ డాక్యుమెంట్లను వ్యాలిడేట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయంతో పాటు ఆ వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్లను కోర్టుల్లో ఉపయోగపడేలా చేస్తారని తెలుస్తోంది.
సాధారణంగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్, సేల్ డీడ్ తో పాటు తదితర ఎవిడెన్సులతో నోటరీ చేసుకుంటారు. అలా నోటరీ చేసుకుని రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్న డాక్యుమెంట్లు లక్షల్లో ఉన్నాయి. అటువంటి వాటికి ఏ మాత్రం పెనాల్టీ లేకుండా, ట్రాఫిక్ చలాన్లకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లుగానే నోటరీ డాక్యుమెంట్ల వ్యాలిడేషన్ పైన స్పెషల్ డ్రైవ్ చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అనధికారికంగా జరిగే అగ్రిమెంట్లను కూడా ఆథరైజ్డ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఇటీవల మహారాష్ట్రలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విధానాన్ని అధ్యయనం చేసి వచ్చారు. దీని ఆధారంగా తెలంగాణలోనూ మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మహారాష్ట్ర విధానం ప్రకారం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో.. లీజు అగ్రిమెంట్లు, రెంటల్ అగ్రిమెంట్లు, కొనుగోళ్లు, అమ్మకాలు, ఇతర పనుల ఒప్పందాలకు సంబంధించి ఈ–రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తేవాలని తెలంగాణ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయంతో పాటు వినియోగదారులకూ ఒక ఆథరైజ్డ్ డాక్యుమెంట్‌ని ఇచ్చినట్లు అవుతుందని భావిస్తోంది.
ఫలితంగా అగ్రిమెంట్లు చేసుకునేవారి మధ్య ఏమైనా తగాదాలు, వివాదాలు వచ్చినా.. న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటిని పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇలాంటి అగ్రిమెంట్లు మాత్రమే కాకుండా సినిమా హిరోలు, ఆర్టిస్టులు వివిధ కంపెనీలతో చేసుకునే అడ్వర్టయిజ్మెంట్ ఒప్పందాలకు కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనే అప్లై చేసుకునేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు.