రీజినల్ వైపు ఉపందుకున్న నిర్మాణాలు
ట్రిపుల్ ఆర్ లోపల అందుబాటులో ధరలు
రీజినల్ వైపు చూస్తున్న మధ్యతరగతి ప్రజలు
పెరుగుతున్న ఇంటి ధరల నేపధ్యంలో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు.. హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల రియాల్టీ మార్కెట్ అందుకోలేని స్థాయికి చేరడంతో ఇప్పుడు అంతా రీజినల్ రింగ్ రోడ్డు వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో రియల్టీకి డిమాండ్ పెరిగే అవకాశముంది. ఆ ప్రాంతాల్లో ఫ్యూచర్ సీటీతో పాటు పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఔటర్-ట్రిపుల్ ఆర్ మధ్య బిల్డర్లు నివాస ప్రాజెక్టులు భారీగా ప్లాన్ చేస్తున్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి ఉన్నవాటితో పాటు ఫాంహౌస్ వెంచర్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల కనీసంగా చదరపు అడుగు 5 వేల రూపాయలు ఉండగా.. రీజినల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో చదరపు అడుగు 3,000 నుంచి ఫ్లాట్లు దొరికే అవకాశముంది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఫ్లాట్ కనీసం 40 లక్షల నుంచి ఇక్కడ లభిస్తుండగా, ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ 60 లక్షల్లో అందుబాటులో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇంటి స్థలాలకు సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా కాలంగా ఇక్కడ వందలాది రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉండగా.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ నిర్మాణం నేపధ్యంలో చాలా మంది ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఆమనగల్, షాద్ నగర్, సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం వైపు ఇంటి స్థలం కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు చదరపు గజం ప్రాంతాన్ని బట్టి రూ. 12,000 నుంచి 18,000 ఉండగా.. ఇప్పుడు కొంతమేర ధరలు పెరిగి చదరపు గజం 15 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల మేర ధరలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.