- రెండు చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) శంషాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కన్నెర్రజేసింది. తనకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి రెండు చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. సదరన్ ప్యారడైజ్ (శ్రీ సంపత్ నగర్)లోని 998 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పార్కును పలు ప్రైవేటు పార్టీలు ఆక్రమించాయనే ఫిర్యాదుతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఆ పార్కు వద్ద పరిశీలన చేశారు.
ఆక్రమణలు నిర్ధారణ కావడంతో పార్కుకు ఆనుకుని నిర్మించిన ఫెన్సింగ్, షెడ్లను తొలగించారు. మరో కేసులో ఓట్ పల్లి గ్రామంలోని కెప్టెన్ టౌన్-2 కాలనీలో 33 అడుగుల రోడ్డు ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదు వచ్చింది. దీనిని కూడా హైడ్రా అధికారులు పరిశీలించి ఆక్రమణలను నిర్ధారించారు. అనంతరం వాటిని కూల్చివేశారు. ఈ కూల్చివేతలన్నీ స్థానిక అధికారులు చేపట్టిన డ్రైవ్ లో భాగంగా జరిగాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఎక్కడైనా అక్రమణ నిర్మాణాలు చేపడితే తీవ్రమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.