హైదరాబాద్‌లో ఎప్పటికైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనేది చాలామంది కోరిక. కానీ, భూముల ధరలు చూస్తేనేమో కొండెక్కి కూర్చున్నాయి. ఫ్లాట్ల ధరలేమో ఆకాశాన్నంటేశాయి. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. నిర్మాణ రంగంలో అనుభవం లేనివారు.. కేవలం ప్లాట్లను అమ్మేవారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన రియల్టర్లు, పెట్టుబడిదారుల కళ్లు.. ఏకంగా యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల మీద పడింది. రేటు తక్కువంటే చాలు.. చాలామంది ముందుకొస్తారని అంచనా వేశారు. మార్కెట్ రేటు కంటే సగం ధరకే ఫ్లాట్ అంటూ మోసపూరిత ప్రకటనల్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. కొనుగోలుదారులకు మోసపూరిత మాటలు చెబుతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు యూడీఎస్, ప్రీలాంచ్ దందాకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అనుమతుల్లేకుండానే పల్లీబఠానీల్లా ఫ్లాట్లను అమ్మేస్తున్నారు. మరి, వీరిని నియంత్రించే నాధుడే లేరా?
దాదాపు ఇరవై నెలల క్రితం.. కరోనా పీక్ సమయం.. జేబులో చిల్లగవ్వ కూడా ఎవరి వద్ద లేదట. అలాంటి సమయంలో భువనతేజ ఇన్‌ఫ్రా అనే సంస్థ హైదరాబాద్‌లో ఆరంభమైంది. అతి తక్కువ కాలంలోనే ఈ సంస్థ నెలకు రూ.10 కోట్లు కమిషన్‌ను ఏజెంట్లకు ఇచ్చే స్థాయికి చేరుకుందట. స్వయంగా ఆ సంస్థ యజమాని వెల్లడించాడు. ఈ సంస్థ 2020లో శామీర్‌పేట్‌లో 3.85 ఎకరాల్లో జి+10 అంతస్తుల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీని ఆరంభించింది. అందులో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్, ఆడిటోరియం వంటివి కూడా నిర్మిస్తామని వెల్లడించింది. మొత్తం 1200 ఫ్లాట్లకు గాను 300 ఫ్లాట్లను చదరపు అడుక్కీ రూ.1600కే విక్రయించింది. పైగా, ఎమినిటీస్ ఛార్జీల్లేవు.. కారు పార్కింగు కోసం కట్టక్కర్లేదు. జీఎస్టీ కూడా చెల్లించక్కర్లేదు. రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగానే చేస్తారని తెలియజేసింది. మరి, ఈ స్థాయిలో ప్రజల్ని మభ్యపెట్టారు కాబట్టి.. ప్రజలు మూకుమ్మడిగా వచ్చి ఫ్లాట్లను కొనుకుండా ఏం చేస్తారు? అంటే, ఈ 300 ఫ్లాట్ల మీద ఎంతలేదన్నా రూ.50 కోట్లు దాకా ఈ సంస్థ వసూలు చేసిందని చెప్పొచ్చు. అక్కడే సెకండ్ ఫేజు స్టార్ట్ చేసింది. చదరపు అడుక్కీ రూ.2200 చొప్పున అమ్ముతోంది. ఏడాది అయినా, వీటికి రెరా అనుమతి ఇప్పటివరకూ రాలేదు.
జి+10 ఎత్తులో అపార్టుమెంట్ కట్టాలంటే చదరపు అడుక్కీ కనీసం రూ.2000 అయినా ఖర్చొస్తుంది. ల్యాండ్ కాస్ట్ అదనం. పైగా, అనుమతులు, ఫీజులకయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుంటే.. ఒక ఫ్లాటును కట్టాలంటే చదరపు అడుక్కీ ఎంతలేదన్నా రూ.3000 దాకా ఖర్చొస్తుంది. ఈ నేపథ్యంలో బిల్డర్ చదరపు అడుక్కీ రూ.1600కే విక్రయిస్తున్నారంటే.. అసలు ఆ ప్రాజెక్టు కడతారా? లేక సొమ్ము తీసుకుని పారిపోతారా? అనే సందేహం ఎవరికైనా కలగాల్సిందే. పోనీ, పాతిక శాతం ఫ్లాట్లు తక్కువకు అమ్మి.. మిగతా 75 శాతం ఫ్లాట్లను అధిక రేటుకు అమ్ముతామంటే.. ఆ బిల్డర్ వద్ద కొనుగోలుదారులు ఎందుకు కొనుగోలు చేస్తారు? పైగా, అప్పటికే తక్కువకు కొన్నవారంతా మార్కెట్లో 2000 నుంచి 2500 మధ్యలో అమ్మకానికి పెడితే.. ఎంతమంది సంస్థ వద్ద పెంచిన రేటును కొంటారు? పైగా, అపార్టుమెంటును ఆషామాషీగా కడతానంటే నిబంధనలు ఒప్పుకోవు. ఒక అపార్టుమెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత దాదాపు ఐదేళ్ల వరకూ బిల్డరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఎలాంటి లోపాలున్నా బిల్డరే సరిదిద్దాలి. నిర్మాణపరమైన లోటుపాట్లు కనిపించిన తర్వాత.. బిల్డర్ వాటిని సరిదిద్దకపోతే.. రెరా కఠిన చర్యల్ని తీసుకుంటుంది. నాసిరకమైన ఫ్లాట్లను అందించి కొనుగోలుదారుల్ని ఇబ్బంది పెట్టి పట్టించుకోకపోతే.. ఆ బిల్డర్‌ను రెరా అథారిటీ జైలుకూ పంపిస్తుంది.
కరోనా సమయంలో.. పదహారు నెలల క్రితం ఆరంభమైన భువనతేజ అనే సంస్థ.. రెరా అనుమతి లేకుండా నగరం నలువైపులా ప్రాజెక్టుల్ని ప్రకటించింది. ఒక్క రూపాయి కూడా లేని ఈ భువనతేజ సంస్థ.. 2021 మే నెలలో కేవలం ఏజెంట్లకు ఇంచుమించు పది కోట్ల కమిషన్ అందజేసింది. ఇలా ఏజెంట్లకు లక్షల కొద్దీ కమిషన్లు అందజేస్తూ అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. రెరా అథారిటీ నుంచి అనుమతి తీసుకుని ప్రాజెక్టుల్ని ఆరంభిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంచక్కా మధ్యతరగతి ప్రజలు ధైర్యంతో ముందుకొచ్చి కొంటారు. కానీ, ఈ సంస్థ అవేమీ పట్టించుకోకుండా.. ముందు ప్రజల్నుంచి సొమ్ము వసూలు చేస్తోంది. తీరిగ్గా ప్రభుత్వ సంస్థల అనుమతి తీసుకుంటానని చెబుతోంది. కానీ, రెరా అనుమతి లేకుండా ప్రాజెక్టును ఆరంభించడం చట్టవిరుద్ధ నేరం. అలా చేస్తే ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను రెరా అథారిటీ విధిస్తుంది. రెరా అనుమతి లేని ప్రాజెక్టుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను ఏజెంట్లను విక్రయించకూడదు. అసలు రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఏజెంట్లు ఫ్లాట్లు అమ్మడానికి వీల్లేదు. తమ అనుమతి లేని ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులు ప్లాట్లు, ఫ్లాట్లను కొనవద్దని తెలంగాణ రెరా అథారిటీ అంటోంది.
This website uses cookies.