Categories: TOP STORIES

విశాఖ వేలానికి కనిపించని స్పందన

  • అధిక ధరే అసలు కారణమా?

ప్రభుత్వం భూములను వేలం వేస్తోందంటే చాలు.. చాలామంది ఎగబడతారు. ఇటీవల తెలంగాణ సర్కారు హైదరాబాద్ లో నిర్వహించిన భూముల వేలానికి ఎంతటి స్థాయిలో స్పందన వచ్చిందో చూశాం. కానీ ఆశ్చర్యకరంగా విశాఖలో భూముల వేలానికి అస్సలు స్పందనే లేకుండా పోయింది. గత పదేళ్లలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 24 ఎకరాల భూముల విక్రయానికి సంబంధించి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ (వీఎంఆర్డీఏ) దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ భూములకు ఈ నెల 12, 15 తేదీల్లో వేలం నిర్వహించాల్సి ఉండగా.. తగినంత స్పందన లేకపోవడంతో వీఎంఆర్డీఏ గడువు పొడిగించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఐదు ప్రాంతాల్లోని భూములకు ఈనెల 28న మరో ఐదు ప్రాంతాల్లోని భూములకు 30న వేలం నిర్వహిస్తారు. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 23, 27వ తేదీలను గడువుగా నిర్దేశించారు.

చదరపు గజానికి కనీస ధర రూ.8వేల నుంచి రూ.40వేల వరకు ఉంది. ఈ కనీస ధరలకే భూములన్నీ విక్రయమైతే సంస్థకు దాదాపు రూ.175 కోట్ల ఆదాయం వస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మధురవాడ, కాపులుప్పాడ నుంచి అనకాపల్లి, భీమునిపట్నం వరకు కీలకమైన ప్రాంతాల్లో ఈ భూములున్నాయి. ఎకరాల్లోనే భూములున్నప్పటికీ, కొనుగోలుదారులు చదరపు గజానికి తమ ధర కోట్ చేయాలి. అధిక ధరలతోపాటు రాజధానిని విశాఖకు మార్చడంపై కొనసాగుతున్న అనిశ్చితి, రియల్ రంగం అంతగా ఆశాజనకంగా లేకపోవడం వంటివి ఈ పేలవమైన స్పందనకు కారణాలని చెబుతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేసే విషయంలో సర్కారు తన వైఖరిని మరోమారు స్పష్టం చేయడంతో వేలానికి తగిన స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. పది ప్రాంతాల్లోని భూములకు నిర్ణయించి అప్ సెట్ ధర మార్కెట్ రేటు కంటే సమానం లేదా ఎక్కువగా ఉందని ఓ డెవలపర్ చెప్పారు. అంతేకాకుండా ఆరు ఎకరాలు కొనాలనుకునేవారు సైతం చదరపుగజాల్లోనే చెల్లించాల్సి రావడం మరో ప్రతికూల పరిణామమని పేర్కొన్నారు. మరి ఈ సారైనా ఈ భూముల వేలానికి తగినంత స్పందన వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

This website uses cookies.