సూపర్ టెక్ కంపెనీ అంటే మనదేశంలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఈ సంస్థ నొయిడాలో అక్రమంగా కట్టిన ట్విన్ టవర్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా కట్టే నిర్మాణాల్ని కూల్చివేస్తామని దేశంలోని బిల్డర్లందరికీ సుప్రీం కోర్టు ఈ ఉదంతం ద్వారా తెలియజేసింది. అయితే, తాజాగా నగరంలోకి సూపర్ టెక్ అనే పేరుతో ఓ సంస్థ రంగప్రవేశం చేసింది. ఈ కంపెనీ తాజాగా ప్రకటించిన ఆఫర్ చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే.
పటాన్‌చెరులోని రుద్రారం వద్ద సాధారణంగా ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలంటే ఎంతలేదన్నా చదరపు అడుక్కీ రూ.5000 దాకా పెట్టాల్సిందే. కాకపోతే, ఈ సంస్థ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ.. చదరపు అడుక్కీ రూ.2499కే ఫ్లాట్లను అందజేస్తానని చెబుతోంది. అదెలాగంటే.. ముందు వంద శాతం పేమెంట్ కడితేనే సుమా! సహజంగా ఏ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులోనైనా ఎమినిటీస్ మరియు కార్ పార్కింగ్ కోసం ఎంతలేదన్నా రూ.8 లక్షల దాకా వసూలు చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం అలాంటిదేం లేదు. ఈ రెండూ ఉచితమేనట. అంటే డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కేవలం రూ.27.50 లక్షల్లోనే వచ్చేస్తుందన్నమాట. మరి, జి ప్లస్ 15 అంతస్తుల్లో గేటెడ్ కమ్యూనిటీని నిర్మించేందుకు ఎంత ఖర్చిస్తుందో ఈ సంస్థకు బాగా తెలిసినట్లుంది. ఆ చిదంబర రహస్యమేంటో చెబితే.. తోటి బిల్డర్లు కూడా పాటిస్తారు కదా.. తద్వారా హైదరాబాద్‌లో అతి చౌక ధరకే సామాన్యులకు ఫ్లాట్లు లభిస్తాయి. పైగా, సమాజానికి ఎంతో గొప్ప మేలు చేసినట్లు అవుతుంది.
ముంబై హైవే మీద నిర్మించాలని ప్రతిపాదిస్తున్న ఈ హైరైజ్‌గేటెడ్ కమ్యూనిటీనికి ఇంకా హెచ్ఎండీఏ నుంచి అనుమతి రాలేదు. బహుశా రెరా అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్న సంగతి ఈ డెవలపర్‌కు తెలియనట్లు ఉంది. అయినా, ఎంచక్కా అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అక్రమంగా సొమ్ము వసూలు చేసే బడా ప్రణాళిక వేశాడీ డెవలపర్. తొలుత పది లక్షలు చెల్లిస్తే ఒక స్కీమ్.. ఐదు లక్షలు కడితే మరో స్కీమ్ కూడా ఆఫర్ పెట్టేశాడు. ఎట్టకేలకు, ప్రజల్నుంచి సొమ్ము వసూలు చేసే పెద్ద స్కెచ్ వేశాడీ సరికొత్త సూపర్ టెక్ బిల్డర్.
మరి, జి ప్లస్ 15 అంతస్తుల ఎత్తులో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మించేందుకు చదరపు అడుక్కీ ఎంత ఖర్చొస్తుంది? అసలింత తక్కువలో కొనుగోలుదారులకు ఫ్లాట్లను కట్టి ఇవ్వొచ్చా? ఈ అంశంలో నగర నిర్మాణ నిపుణులే ప్రజలకు స్పష్టతనివ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో రెరా అథారిటీ ప్రీలాంచ్ సంస్థల మీద గట్టి చర్యలు తీసుకోనంత కాలం.. ఇలా పుట్టగొడుగులా కొత్త సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి.. ప్రజల్నుంచి సొమ్ము వసూలు చేస్తూనే ఉంటాయి. రానున్న రోజుల్లో ఎన్ని సాహితీ వంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చినా.. అవన్నీ కేవలం రెరా అథారిటీ నిష్క్రియాపరత్వం వల్లే వచ్చాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి, ఇప్పటికైనా రెరా అథారిటీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తే.. అమాయక కొనుగోలుదారులను రక్షించినట్లు అవుతుంది.