Categories: LATEST UPDATES

యూడీఎస్ రిజిస్ట్రేషన్ ‘నో’

  • రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ తాజా ఆదేశం
  • యూడీఎస్ రిజిస్టర్ చేయకూడదని 1997లోనే జీవో
  • ఇందులో కొత్తేముందని అంటున్న రియల్టర్లు

ఇక నుంచి బిల్డర్లు, డెవలపర్లు ఇష్టం వచ్చినట్లు యూడీఎస్ కింద స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. స్థానిక సంస్థ ఆమోదం పొందిన తర్వాత కన్ స్ట్రక్షన్ ఒప్పందం లేదా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటే తప్ప యూడీఎస్ స్థలాన్ని రిజిస్టర్ చేయకూడదని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్స్ పెక్టర్ జనరల్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అపార్టుమెంట్ లేదా వాణిజ్య సముదాయం కట్టేందుకు అవసరమయ్యే డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉంటేనే యూడీఎస్ కింద స్థలాన్ని రిజిస్టర్ చేస్తారు. ఇందుకు స్టాంప్ డ్యూటీ తప్పనిసరి కట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

కొందరు బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు, వ్యక్తిగత పెట్టుబడిదారులు.. యూడీఎస్ పేరిట బిల్టప్ ఏరియాను విక్రయిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించక ముందే, నిర్మాణం జరపక ముందే తగ్గింపు రేటుకే అమ్ముతున్నారు. అపార్టుమెంట్లతో బాటు వాణిజ్య స్థలాల్ని కూడా ఈ విధానంలో విక్రయిస్తున్నారు. పైగా, యూడీఎస్ కింద వసూలు చేసే సొమ్మును ఆయా నిర్మాణం కోసం కాకుండా ఇతర కట్టడాల్ని చేపట్టేందుకు వినియోగిస్తున్నారని, ఇలాగైతే అట్టి నిర్మాణాలు ఆరంభం కాకపోవడం, ఆలస్యమయ్యే ప్రమాదముంది. దీంత అమాయక కొనుగోలుదారులు ప్రమాదంలో పడే ఆస్కారముంది. అందుకే, వీటిని ఎట్టి పరిస్థితిలో అనుమతించకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నది.

యూడీఎస్ రిజిస్ట్రేషన్లు చేయకూడదనే జీవో 1997లోనే ఉన్నదని కొందరు డెవలపర్లు అంటున్నారు. ఇందులో కొత్తేముందని ప్రశ్నిస్తున్నారు. యూడీఎస్ అమ్మకాల్ని చేసేవారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అంతేతప్ప, ఏవో కంటితుడుపు చర్యల్ని తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు.

This website uses cookies.