Categories: LATEST UPDATES

పరిహారం కోసం పాతబస్తీ ఎదురుచూపు

  • రోడ్డు విస్తరణ కోసం పలువురి నుంచి భూమి సేకరణ
  • ఇప్పటికీ చెల్లించని పరిహారం

హైదరాబాద్ పాతబస్తీలోని దూద్ బౌలి, ఫతే దర్వాజా తదితర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ కోసం తమ ప్రాపర్టీలు కోల్పోయిన పలువురు యజమానులు పరిహారం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. గత రెండేళ్లుగా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ స్పందించడంలేదని వాపోతున్నారు. తమకు రావాల్సిన పరిహారం కోసం ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు కూడా సమర్పించామని.. కానీ ఎలాంటి ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు.

 

ప్రభుత్వం నుంచి పరిహారం వచేంత వరకు ఎక్కడ ఉండాలో తెలియక బంధువుల ఇంటికి వెళ్లామని.. రెండేళ్లు అవుతున్నా, ఇంకా పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ‘రోడ్డు విస్తరణ పనుల కోసం మా ఇంటిని తీసుకున్నారు. మరుసటి రోజే మీకు పరిహారం అందుతుందని అప్పుడు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇది దారుణమైన మోసం’ అని ఓ బాధితురాలు మండిపడ్డారు. ‘అవసరమైన అన్ని పత్రాలూ సమర్పించాం. కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. మాకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి మా ప్రాపర్టీలు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదు’ అని మరో బాధితుడు విమర్శించారు. ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించగా.. మాట్లాడటానికి నిరాకరించారు.

This website uses cookies.