ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నవారు నామమాత్రపు రుసుము చెల్లించి ఆ భూమిని క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ 2014 డిసెంబర్ లో జారీచేసిన జీవో నెం. 59పై ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభయానంద్ కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని నామమాత్రపు ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవడానికి వీలుగా జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ 2015లో సీనియర్ లెక్చరర్ అన్వర్ ఖాన్ పిల్ దాఖలు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యం తాజాగా మరోసారి విచారణకు వచ్చింది. ‘ఆక్రమణ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో నెంబర్లు 58, 59 జారీచేసింది. ఒక చదరపు గజం నుంచి 250 చదరపు గజాల మధ్యనున్న భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు జారీచేసిన జీవో 58ని మేం సవాల్ చేయడంలేదు.
కానీ 251 చదరపు గజాల నుంచి ఆ పై ఎంత ఎక్కువ భూమి ఉన్నా నాలుగు వాయిదాల్లో నామమాత్రపు రుసుం చెల్లిస్తే క్రమబద్ధీకరణ చేసేందుకు జారీ చేసిన 59 జీవోనే సవాల్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ జీవో ఆక్రమణదారులను మరింత ప్రోత్సహించేదిగా ఉంది’ అని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయడంలో ఆలస్యం చేయడమే కాకుండా తాజాగా క్రమబద్ధీకరణకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో నెంబర్ 14 జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఆరువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 20కి వాయిదా వేసింది.
This website uses cookies.