మీరు కోటి రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ కొంటుంటే.. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులన్నీ లెక్కిస్తే.. ఎంతలేదన్నా రూ.35 నుంచి 40 లక్షలు అవుతుందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. దీని కారణంగానే ఫ్లాట్లు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని అంటున్నాయి. ఈ పన్నుల శాతం తగ్గినప్పుడే మెట్రో నగరాల్లో నివసించే ప్రజలు సంతోషంగా సొంతింట్లో నివసించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.
దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని అవలంభిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. అవి వాస్తవరూపం దాల్చట్లేదు. ఒక ఇల్లు కట్టాలంటే సుమారు 250 పరిశ్రమలు కలిసికట్టుగా పని చేస్తేనే సాధ్యమవుతుంది. ఈ క్రమంలో ఇన్ని పరిశ్రమలపై రకరకాల పన్నుల్ని విధిస్తున్నారు. ఇందులో ప్రధానమైనది జీఎస్టీ. ఒక్కో వస్తువుపై ఒక్కో రకంగా జీఎస్టీని విధిస్తున్నారు. డెవలపర్లకు జీఎస్టీ మీద ఇన్‌పుట్ క్రెడిట్ లభించేది. ఇప్పుడది కూడా తొలగించారు. గృహ కొనుగోలుదారులు కొనే ఫ్లాట్ మీద ఐదు శాతం జీఎస్టీ కట్టాల్సిందే. అది కాకుండా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించక తప్పదు. రాష్ట్రాలను బట్టి ఈ ఛార్జీలు మారుతుంటాయి. అంటే, ఒక ఇల్లు తయారయ్యేటప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలురకాల పన్నుల్ని వసూలు చేశాక కూడా.. మళ్లీ బయ్యర్లు 5 శాతం జీఎస్టీ, ఏడున్నర శాతం స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించాల్సిన దుస్థితి. కోటి రూపాయలు పెట్టి డబుల్ బెడ్‌రూం ఫ్లాటును కొనుగోలు చేస్తే.. దాని మీద జీఎస్టీయే రూ.5 లక్షల్ని చెల్లించాల్సి వస్తుంది. అదనంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కట్టాల్సి వస్తోంది. ఈ కారణంగానే అధిక శాతం మంది సొంతింటి కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి, ఈ విషయమై పునరాలోచించి.. ద్వంద్వ పన్ను విధానాన్ని తొలగించాలన నిర్మాణ నిపుణులు కోరుతున్నారు.