క్రెడాయ్ తెలంగాణ ఆఫీసు
ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో ప్రప్రథమంగా కింద స్కైవే దాని మీద మెట్రో రైలును నిర్మించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జూబ్లీ బస్టాండ్ నుంచి శామీర్ పేట్ దాకా.. ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా.. ఒక్కోటి పద్దెనిమిదిన్నర కిలోమీటర్ల చొప్పున.. మెట్రో రైలుతో పాటు స్కైవేను నిర్మిస్తామని తెలిపారు. గురువారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని క్రెడాయ్ తెలంగాణ ఆఫీసు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఏమన్నారో కేటీఆర్ మాటల్లోనే..
2024లో కేంద్రంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే.. కరీంనగర్, మంచిర్యాలకు సులువుగా వెళ్లేందుకు అవసరమయ్యే స్కైవే నిర్మాణ పనుల్ని ఆరంభిస్తాం. కొన్నేళ్ల నుంచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంటే పెద్దగా పట్టించుకోవట్లేదనే విషయం తెలిసిందే. మొదటి ఫేజు మెట్రో పూర్తయ్యింది. పటాన్‌చెరు నుంచి ఒకవైపు.. ఈసీఐఎల్ నుంచి మరోవైపు.. మొత్తానికి నగరం నలువైపులా 250 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలును డెవలప్ చేస్తాం. శంషాబాద్ దాకా డెవలప్ చేసే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ టెండర్ దశలో ఉంది. రాజేంద్రనగర్‌లో ఇందుకు సంబంధించిన పనుల్ని ఆరంభిస్తాం. సౌత్ వెస్ట్ కారిడార్‌లో వేసే ఈ మెట్రో వల్ల శంషాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు మాదాపూర్, గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలకు రాకపోకలు సులువు అవుతాయి. ఈ కారిడార్‌లో మరిన్ని పరిశ్రమలు వస్తాయి. ఫార్మా సిటీకి సంబంధించి కొన్ని కోర్టు కేసులున్నాయి. సౌత్ ఈస్ట్‌తో పాటు నార్త్ ఈస్ట్ గణనీయంగా వృద్ధి చెందుతుంది.
This website uses cookies.