Categories: LATEST UPDATES

ఒక్క ఫ్లాట్.. రూ.97 కోట్లు

దేశంలో ఖరీదైన రియల్ లావాదేవీల జోరు కొనసాగుతోంది. తాజాగా ముంబైలో మరో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు నమోదైంది. ఇక్కడి పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్ లో రూ.97.4 కోట్లకు ఓ ఫ్లాట్ అమ్ముడైంది. 16 వేల చదరపు అడుగుల్లో సీ ఫేసింగ్ తో ఉన్న ఈ ఫ్లాట్ ను కిరణ్ జెమ్స్ ప్రమోటర్లు ఇంత మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు. మావ్ జీ భాయ్ షామ్ జీ భాయ్ పటేల్, రసికబెన్ మావ్ జీ భాయ్ పటేల్, ముంజల్ మావ్ జీ భాయ్ లఖానీ కలిసి ఈ ప్రాపర్టీ కొనుగోలు చేశారు.

ఈ భవనంలోని 47వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్ మెంట్ రెరా కార్పెట్ ఏరియా ప్రకారం 14,911 చదరపు అడుగులు కాగా, అదనంగా 884 చదరపు అడుగులు కూడా కలిపి రూ.97.4 కోట్లకు తీసుకున్నారు. ఈ లావాదేవీ ఏప్రిల్ 29న జరిగింది. స్టాంపు డ్యూటీ కింద రూ.5.8 కోట్లు చెల్లించారు. ఒయాసిస్ రియల్టీ భాగస్వామి స్కైలార్క్ బిల్డ్ కన్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని విక్రయించింది. కిరణ్ జెమ్స్ అనేది జ్యుయలరీ పరిశ్రమలో ప్రముఖ సంస్థ. కాగా, ముంబైలో ఒబెరాయ్ 360 వెస్ట్ అనే ప్రాజెక్టు అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇందులో 4 బీహెచ్ కే, 5 బీహెచ్ కే యూనిట్లు ఉన్నాయి. రెండు టవర్లుగా ఉన్న ఈ ప్రాజెక్టులో ఓ టవర్ లో రిట్జ్-కార్ల్ టన్ హోటల్ ఉండగా.. మరో టవర్ లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. సముద్రం కనిపించేలా నిర్మించిన ఈ టవర్ ఎత్తు 360 మీటర్లు ఉండగా.. అన్ని అపార్ట్ మెంట్లు వెస్ట్ ఫేసింగ్ ఉండటంతో ఈ ప్రాజెక్టుకు ఒబెరాయ్ 360 వెస్ట్ అని పేరు వచ్చింది.

This website uses cookies.