- సొంతింటి సాకారానికి కేరాఫ్
ఔటర్-రీజినల్ రింగ్ రోడ్డు
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. అందులోను హైదరాబాద్లో ఇల్లు కావాలని చాలా మంది కోరుకుంటారు. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న ధరల నేపధ్యంలో మధ్యతరగతి వాళ్లు గ్రేటర్ సిటీలో సొంతిల్లు కొనలేకపోతున్నారు. నగరం నడిబొడ్డునే కాదు శివారు ప్రాంతాల్లోను ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చాలా మందికి సొంతింటి కల.. కలగానే మిగిలిపోతుంది. అయితే ఇళ్ల ధరలు పెరగడమే కాని తగ్గడం ఉండదని చెబుతున్న రియల్ రంగ నిపుణులు.. భవిష్యత్తు అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కు కాస్త దూరంలోనైనా ఇంటి స్థలం లేదంటే ఇల్లు కొనుక్కోవాలని సూచిస్తున్నారు. అందుకు ఔటర్ రింగ్ రోడ్డు, నిర్మాణం జరుపుకోనున్న రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యనున్న ప్రాంతాలను ఎంచుకోవాలని అంటున్నాయి రియాల్టీ వర్గాలు.
గ్రేటర్ హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరించింది. సెంట్రల్ హైదరాబాద్ నుంచి మొదలు.. నగర శివారు ప్రాంతాలు అన్ని వైపులా దాదాపు 25 కిలోమీటర్ల మేర అభివృద్ది చెందాయి. మౌలిక వసతుల ఏర్పాటులోను అన్ని ప్రాంతాలు వేగంగా డెవలప్ అవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణాలు భారీగా వచ్చాయి. అపార్ట్ మెంట్ల నుంచి మొదలు విల్లా ప్రాజెక్టుల వరకు పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ సిటీలో ఇల్లు కొనలేని వారంతా ఇప్పుడు శివారు ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్ సిటీ శివారు ప్రాంతాల్లోను ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. శంషాబాద్, బోడుప్పల్, శామీర్ పేట, శంకర్ పల్లి, సుచిత్ర, మేడ్చల్, ఆదిబట్ల వంటి శివారు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కనీసం 80 లక్షల నుంచి కోటి రూపాయలుగా ఉంది. రెండేళ్ల వరకు అందుబాటులో ఉన్న ఇళ్ల ధరలు ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ కారణంగా మధ్యతరగతి ప్రజానీకం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోను ఇళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది.
ఇక ఇప్పుడు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఔటర్ రింగ్ రెడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫార్మా క్లస్టర్స్, విద్యా-వైద్య సంస్థలు, గేమింగ్ జోన్లు, స్పోర్స్ట్ జోన్స్, రీక్రియేషన్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సిటీకి అన్నివైపులా అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. వీటిని జాగ్రత్తగా గమనిస్తున్న రియాల్టీ వర్గాలు.. సహజంగానే రియల్ ఎస్టేట్ కూడా ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యనే విస్తరణకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నాయి.
సిటీలో ఇల్లు, స్థలాలు కొనలేకపోయినవారు ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాల్లో ఇంటి స్థలం లేదంటే ఇంటి కొనుగోలుకు ప్లాన్ చేసుకోవాలని రియాల్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలోనే అత్యధిక సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. కళాశాలలే కాదు అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఇక్కడ విశాలమైన ప్రాంగణాల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం సిటీ నుంచి రోజూ అక్కడికి విద్యార్థులు వెళ్లి వస్తున్నారు. లేదంటే గురుకులంలో ఉంటున్నారు. మున్ముందు ఆయా విద్యా కేంద్రాల చుట్టుపక్కల నివాసాలు భారీగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లు సైతం ఓఆర్‌ఆర్ బయటే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు రద్దీ పెరిగేకొద్దీ రవాణా వ్యవస్థ మెరుగుయ్యే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా రెండో దశ మెట్రో విస్తరణతో కనెక్టివిటీ సైతం పెరగనున్నది.
రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి పర్యాటక కేంద్రం, కన్హా శాంతివనం, సమతామూర్తి కేంద్రం, ప్రముఖ దేవాలయాలు, రిసార్ట్‌లన్నీ ఔటర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. దేశ, విదేశాల నుంచి ఈ కేంద్రాలను సందర్శించేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాలన్నీ మరింత బిజీగా మారడంతో పాటు పెద్ద ఎత్తున మౌళిక వసతులు ఏర్పాటు కానున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక్కడ ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, టౌన్‌షిప్పులు, స్టేడియం వంటివి ఏర్పాటు చేయనున్నది. అందుకే భవిష్యత్తు రియాల్టీ విస్తరణ ఈ ప్రాంతాల్లోనే ఉంటుందని డెవలపర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అన్ని వైపులా సంగారెడ్డి, షాద్ నగర్, ఆమన్ గల్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీం పట్నం, చేవేళ్ల వైపు ఎవరికి అనువైన ప్రాంతంలో వారు ఇంటి స్థలం, లేదంటే ఇళ్లు కొనుక్కోవాలని సూచిస్తున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో ఇక్కడ కూడా క్రమంగా భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంటి స్థలాల ధరలు, ఇళ్ల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. అందుకే ఔటర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వాళ్లు ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఓఆర్ఆర్-ట్రిపుల్ ఆర్ మధ్యలో ప్రాంతాన్ని బట్టి డీటీసీపీ లేఅవుట్లలో చదరపు గజం 15 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల అపార్ట్ మెంట్స్, విల్లాల నిర్మాణం జరుగుతుండగా.. ఫ్లాట్ చదరపు అడుగు 5 వేల రూపాయలుండగా, విల్లాలు కోటిన్నర నుంచి మొదలవుతున్నాయి. హైదరాబాద్ లో ఇళ్లు కొనలేకపోయిన వారు ఇక ఆలస్యం చేయకుండా స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.