- ఫ్లాట్ విస్తీర్ణం లెక్కించేదెలా?
- మొత్తం విస్తీర్ణంలో కార్పెట్ ఏరియా ఎంత?
- బిల్టప్ ఏరియా ఎంత విస్తీర్ణంలో వస్తుంది?
- ఫ్లాట్లో ఇంటి విస్తీర్ణం 70 శాతమే
అపార్ట్ మెంట్ లేదా గేటెడ్ కమ్యునిటీలో ఇల్లు కొనే సమయంలో విస్తీర్ణానికి సంబందించి చాలా అయోమయం ఉంటుంది. బిల్డర్లు కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే పదాలు చెబుతుంటే చాలా మందికి అవగాహణ ఉండదు. బిల్డర్ చెప్పే ఇంటి విస్తీర్ణంలో ఏయే ఏరియాలు కలిసుంటాయి? మనం కొనే ఇంటి విస్తీర్ణంలో కామన్ ఏరియా పోను వచ్చే ఏరియా ఎంత? అసలు మనం కొనేదెంత విస్తీర్ణం.. మనకు వచ్చే విస్తీర్ణం ఎంత?
సాధారణంగా ఇల్లు కొనే సమయంలో ప్రాంతం, బడ్జెట్ తరువాత అందరూ చూసేది విస్తీర్ణాన్నే. వారి వారి అవసరాలను బట్టి ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు కావాలనేది నిర్ణయించుకుంటారు. అయితే ఇల్లు కొనడానికి వెళితే కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే పదాలు బిల్డర్ నుంచి ఎక్కువగా వినపడుతుంటాయి. మరి, కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారికి ఈ విషయాలపై కొంత అవగాహన ఉంటే ఇంటి విస్తీర్ణం తమ కుటుంబానికి సరిపోతుందా.. తమకు సరిపోయేలా డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూం ఇల్లు తీసుకోవాలా అనే నిర్ణయానికి రావడానికి ఉపయోగపడుతుంది.
సాధారణంగా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనే సమయంలో కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, సేలబుల్ ఏరియా గా విభజిస్తారు. ఇందులో కార్పెట్ ఏరియా ప్రధానమైంది. ఇంటికి సంబంధించి బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం కార్పెట్ ఏరియా కిందకు వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాల్, పడక గదులు, వంటగది, స్నానాల గదుల వరకు కార్పెట్ ఏరియాగా పరిగణిస్తారు. అంటే మనం కొనే ఇంటికి ఎంత మేర కార్పెట్ ఏరియా వస్తుందో లెక్కలేసుకుంటే ఆ విస్తీర్ణం మన కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోతుందా లేదా అన్న నిర్ణయానికి రావచ్చన్నమాట.
ఇంటికి సంబంధించి ఆ తరువాత చెప్పుకోవాల్సింది బిల్టప్ ఏరియా గురించి. కార్పెట్ ఏరియాతో పాటూ ఇంటి బయటి గోడలు, బాల్కనీలు బిల్టప్ ఏరియా పరిధిలోకి వస్తాయి. బిల్డర్లు మొత్తంగా కొనుగోలుదారులకు విక్రయించేది సూపర్ బిల్టప్ ఏరియాను. అంటే బిల్టప్ ఏరియాతో పాటూ మిగతా ఇళ్లకు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్, మెట్లు, లిఫ్ట్ మార్గాలు, క్లబ్‌హౌస్ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్ వాటాని కలిపి లెక్కిస్తారు. ఇంటి కొనుగోలుదారుడికి ఫైనల్ గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్ ఏరియా లేదా సూపర్ బిల్టప్ ఏరియా అని అంటుంటారు. అంటే మనం బిల్డర్ నుంచి కొనే మొత్తం ఇంటి విస్తీర్ణంలో మన ఇంటి విస్తీర్ణం అంటే కార్పెట్ ఏరియా సుమారు 70 శాతం వస్తుంది.
ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యాలకే పెద్దపీట వేస్తున్నారు బిల్డర్లు. దీంతో సహజంగానే 30 శాతం విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. బిల్డర్ దగ్గర 1200 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియా ఫ్లాట్ తీసుకుంటే.. ఇంటి లోపల వచ్చే కార్పెట్ ఏరియా 860 నుంచి 900 చదరపు అడుగులే ఉంటుందన్నమాట. కాబట్టి అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ లేదా గేటెడ్ కమ్యునిటీలో ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మనకు వచ్చే విస్తీర్ణమెంత? కామన్ ఏరియా ఎంత అనే అంశాలపై బిల్డర్ ను అడిగి తెలుసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.