Categories: LATEST UPDATES

ఏపీలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు

  • 66,111 మందికి హక్కులు

అసైన్డ్ భూములపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్డ్ భూమి పొంది 20 ఏళ్లు పూర్తయితే ఆ భూమిపై వారికి పూర్తి హక్కులు రానున్నాయి. మొత్తం 63,191.84 ఎకరాల అసైన్డ్, లంక భూములపై 66,111 మందికి హక్కులు లభించనున్నాయి. అసైన్డ్ భూమి పొందిన అసలు అసైనీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ అసలైన అసైనీలు మరణిస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ఇతర రైతులకు ఉన్నట్టుగానే వీరికి కూడా ఆ భూముల క్రయ విక్రయాలకు హక్కులు వస్తాయి. అలాగే మూడు కేటగిరీల్లోని 9,602 ఎకరాల లంక భూముల రైతులకు డీ పట్టాలు లభిస్తాయి.

అలాగే కొన్ని భూములను ఐదేళ్లు లీజు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. ఇక గ్రామాల్లో కుల వృత్తులు చేసుకునేవారికి ఇచ్చిన సర్వీస్ ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోదించింది. కుమ్మరి, రజక, కమ్మరి, నాయీ బ్రాహ్మణ తదితర కుల వృత్తులు చేసుకునే వారికి గతంలో ఇనామ్ గా ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించి వారికి కూడా హక్కులు కల్పించనున్నారు. అమరావతి సీఆర్డీఏలో 47వేల ఇళ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. మరోవైపు వర్సిటీల్లో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచింది.

This website uses cookies.