వినియోగదారుని సొమ్మును రెండేళ్ల పాటు తన దగ్గరే ఉంచుకున్నందుకు ఓ పట్టణాభివృద్ధి సంస్థకు జిల్లా వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. ఆ కాలానికి ఏడు శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా కేసు ఖర్చుల కింద ఫిర్యాదుదారునికి రూ.5 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది.
కాన్పూర్ కి చెందిన కాంతి సింగ్ 2016 ఫిబ్రవరి 27న ఓ ప్లాట్ కొనుగోలు కోసం కాన్పూర్ పట్టణాభివృద్ధి సంస్థ (కేడీఏ)కు దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ కేటాయింపు తర్వాత దాని ధరలో పది శాతం మొత్తాన్ని రూ.4,23,000 చెల్లించారు. అనంతరం బ్యాంకు నుంచి రుణం తీసుకుని రూ.36.42 లక్షలు చెల్లించారు. తర్వాత ప్లాట్ అప్పగించాలని కోరగా.. కేడీఏ ఇవ్వలేదు. ఆమె దరఖాస్తు చేసుకున్న ప్లాట్ కాకుండా మరో ప్లాట్ ఇస్తామని పేర్కొంది. ఇందుకు కాంతి సింగ్ అంగీకరించలేదు.
తాను చెల్లించిన డబ్బు వెనక్కి ఇచ్చేయాలని కోరారు. రెండేళ్ల తర్వాత కేడీఏ రూ.40,65,600 తిరిగి చెల్లించింది. దీంతో కాంతి సింగ్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. తన సొమ్మును రెండేళ్లపాటు వారి దగ్గరే ఉంచుకోవడం నిబంధనలకు విరుద్ధమని.. అందువల్ల ఆ మొత్తంపై వడ్డీ చెల్లించేలా ఆదేశించాలని కోరారు. ఆమె వాదనతో ఏకీభవించిన ఫోరం.. ఏడు శాతం వడ్డీ చెల్లించాలని కేడీఏను ఆదేశించింది.