-
ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం
-
ఈ జీవో ఎత్తివేత వెనుక అవినీతి ఉంది
-
శాస్త్రీయ కారణాలు లేకుండానే ఈ నిర్ణయం
-
ప్రముఖ పర్యావరణవేత్త డా. లుబ్నా సర్వత్
హైదరాబాద్ లో చిన్నపాటి వాన వస్తే చాలు.. ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎగువ నుంచి వస్తున్న వరదను మళ్లించడానికి గండిపేట గేట్లు ఎత్తివేస్తున్నారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ పునరావృతం అవుతుంది కదా? మరి ఇలాంటి పరిస్థితిల్లో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఆలోచించాలి. క్యాచ్ మెంట్ ఏరియాలో షాపింగ్ మాల్స్, విల్లాలు, ఐటీ కంపెనీలు, అపార్ట్ మెంట్లు ఏర్పాటైతే వాటి నుంచి వచ్చే మురికి నీరంతా ఎక్కడికి పోతుంది? ఇప్పటిదాకా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల జనమంతా మురికిని మూసీలోకి వదిలేయడం ఖాయం. అలాంటప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాలు మరో రెండు హుస్సేన్ సాగర్లలా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడం సరికాదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ప్రముఖ పర్యావరణ వేత్త లుబ్నా సర్వత్ తన అభిప్రాయాలను రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..
జీవో నెం.111 అంశంపై ముగ్గురు సైంటిస్టులు రూపొందించిన పీపుల్స్ సైంటిఫిక్ కమిటీ రిపోర్టును విడుదల చేయడానికి కారణం ఏమిటంటే.. ట్రిపుల్ వన్ జీవో అనేది ఐదు రిపోర్టులు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఆధారంగా వెలువడింది. ఇలాంటి సమయంలో ఆ జీవోనే తీసేస్తున్నారు. అసలు ఆ జీవోను తీసివేసే అర్హత ప్రభుత్వానికి ఉందా అంటే.. మాకు తెలిసినంత వరకు ప్రభుత్వానికి లేదు. పోనీ దీనిని తీసేయడానికి ఈ రిపోర్టు ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారు అని ఆలోచించినా.. అలాంటి ఒక్క రిపోర్టు కూడా లేదు. ఈ నేపథ్యంలో మేం నగరంలో ఉన్న ముగ్గురు సైంటిస్టులను దీనిపై రిపోర్టు ఇవ్వాలని కోరగా.. అందుకు వారు అంగీకరించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రిపోర్టు తయారు చేసి విడుదల చేశారు. ఈ రిపోర్టును మేం ప్రభుత్వానికి ఇస్తాం.. హైకోర్టుకు ఇస్తాం.. సుప్రీంకోర్టుకు ఇస్తాం.. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి, ప్రజలందరికీ కూడా అందజేస్తాం.
ప్రస్తుతం వాతావరణం ఎలా మారిపోతోందో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పర్యావరణపరంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి? పర్యవరణాన్ని ధ్వంసం చేయడం అంతర్జాతీయ నేరమని రెండు వారాల క్రితమే నిర్ధారించారు. ఇక్కడ జీవో నెం.111 అనేది జంట జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాలో హోటళ్లు, మాల్స్, వాణిజ్య భవనాల వంటివాటిని నిరోధిస్తుంది. అలాగే అక్కడ వ్యవసాయం, ఉద్యాన పంటల వంటి వాటికి అనుమతి ఉన్నట్టు జీవోలో చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి సందర్భంలో అక్కడ నిషేధం ఉన్న వాటిని ఎలా అనుమతిస్తారు? ఇక్కడ ప్రభుత్వం ఓ విషయం గమనించాలి. వాస్తవానికి 1908లో ఈ జలాశయాన్ని కట్టినప్పుడు వరద నిరోధక మెకానిజం ఆధారంగా నిర్మించారు. అయితే, ప్రభుత్వం మాత్రం వాటిని మంచినీటి వనరులుగానే పరిగణిస్తున్నాయి తప్ప.. ఫ్లడ్ నిరోధక మెకానిజం అని చెప్పడంలేదు.