ఎన్నికల నగారా మోగడంతో.. ప్రభుత్వ అధికారులు దృష్టి సారించరనే కారణంతో.. కొందరు ప్రీలాంచ్ అక్రమార్కులు మళ్లీ చెలరేగిపోతున్నారు. రెండు నెలలు ప్రభుత్వం ఎన్నికల్లో బిజీగా ఉంటుందనే అంశాన్ని ఆసరాగా చేసుకుని.. ప్రీలాంచ్ మోసగాళ్లు పాత దందాను ఉదృత్తం చేస్తున్నారు. విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. కొందరు మోసగాళ్లు సుప్రీం కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లోనే ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్ముతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు రూ.400 నుంచి రూ.500 కోట్ల దాకా ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇంకెంత వసూలు చేస్తారో తెలియాల్సి ఉంది. మరి, సుప్రీం కోర్టు కేసుల్లో ఉన్న భూమిలో అపార్టుమెంట్లను ఎలా నిర్మిస్తారు? అనుమతిని ఎవరిస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న అని చెప్పొచ్చు. మొత్తానికి, ఈ తాజా ఉదంతం మరో సాహితీ కేసులా తయారయ్యే ప్రమాదముందని అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మై హోమ్ మంగళ ప్రాజెక్టుకు ఎదురుగా ఉన్న భూములు హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ 80 పరిధిలోకి వస్తాయి. వీటిపై ప్రభుత్వానికి, కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీం కోర్టులో కేసు ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి.. కొనుగోలుదారులకు చెప్పాపెట్టకుండా.. బిల్డాక్స్ అనే సంస్థ ప్రీలాంచ్ దందాకు తెరలేపింది. సుమారు ముప్పయ్ ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న స్థలంలో బిలాక్స్ సంస్థ 35 అంతస్తులను నిర్మిస్తుందట. సుప్రీం కోర్టులో కేసు ఉన్న ఈ భూమిలో అపార్టుమెంట్లు ఎలా కడతారు? అనుమతి ఎవరిస్తారు? అసలీ కేసు ఎప్పుడు తేలుతుంది? ఇలాంటి అంశాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా బిల్డాక్స్ సంస్థ ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తుండటం గమనార్హం. నిజానికి చెప్పాలంటే, బిలాక్స్ సంస్థ అందజేసే ఆఫర్‌ను చూస్తే ఎవరికైన మతిపోవాల్సిందే. ఎందుకో తెలుసా? రెండు వారాల్లో వంద శాతం సొమ్ము చెల్లించేవారికి.. చదరపు అడుక్కీ రూ.4500కే ఫ్లాట్లను అందజేస్తారట. అయితే, ఇందులో న్యాయపరమైన చిక్కులున్నాయనే విషయం తెలుసుకోకుండా.. కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నారని తెలిసింది. ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే అన్నివిధాల ఉత్తమం అని చెప్పొచ్చు.
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఓ ప్రీలాంచ్ వ్యవహారం రియల్ ఎస్టేట్ గురు టాస్క్‌ఫోర్స్ దృష్టికొచ్చింది. దీంతో ఈ వ్యవహారం గురించి కూపీ లాగింది. వాట్సప్పుల్లో చక్కర్లు కొడుతున్న పలువురు ఏజెంట్లతో మాట్లాడింది. వారు చెప్పిన వివరాల ప్రకారం.. అసలీ స్థలం ఎక్కడుంది? ఏయే సర్వే నెంబర్లలో ఉందనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేసింది. దీంతో అసలు విషయం బయటికొచ్చింది. ఈ సంస్థ ప్రీలాంచ్ వ్యవహారాన్ని ఎంతో జాగ్రత్తగా నడిపింది. ఎక్కడా కంపెనీ పేరు రాకుండా జాగ్రత్త పడినప్పటికీ.. సొమ్ము చెల్లించాల్సిన కంపెనీ అకౌంట్ నెంబర్లు బయటికి రావడంతో.. బిల్డాక్స్ సంస్థే ఈ ప్రీలాంచ్ దందాను నడిపిస్తోందని స్పష్టమైంది.
This website uses cookies.