నగరానికి చెందిన లహరి రిసార్ట్స్ అధినేత జి.హరిబాబు.. నరెడ్కో (ద నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం నరెడ్కో ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ సంఘానికి ఛైర్మన్‌గా నిరంజన్ హారానందానీ, వైస్ ఛైర్మన్‌గా రాజన్ బండేల్కర్‌లు వ్యవహరిస్తారు. నిర్మాణ రంగంలో సుమారు నాలుగు దశాబ్దాల అనుభవం గల జి.హరిబాబు గతంలో అప్రెడా అధ్యక్షుడిగా నాలుగేళ్లు ఉన్నారు.
అప్రెడాను నరెడ్కో ఏపీగా రూపాంతరం చెందిన తర్వాత అదనంగా మరో నాలుగేళ్లు అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆయన హయంలో ఏపీలో కొత్తగా పన్నెండు ఛాప్టర్లు ఏర్పాటయ్యాయి. దాదాపు పన్నెండు వందల మంది బిల్డర్లు సభ్యలుగా చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో రియల్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇందులో నరెడ్కో క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సుస్థిరమైన ప్రగతికి పెద్దపీట వేస్తూనే.. సరికొత్త ఆవిష్కరణలు, పారదర్శకత వంటి అంశాలపై దృష్టి పెడతామని అన్నారు.