నార్సింగిలో 2014 కంటే ముందు ఫ్లాట్ల ధర చదరపు అడుక్కీ రూ.3000 ఉండేది. 2017 తర్వాత రేటు పెరిగి ప్రస్తుతం రూ.7000 నుంచి రూ.8000 చెబుతున్నారు. కొత్తగా ఈ రేటుకు ఫ్లాట్లు కొన్నవారు.. అప్రిసీయేషన్ అందుకోవాలంటే నార్సింగిలో ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ రూ.11 నుంచి 12 వేలకు పెరిగితే తప్ప సాధ్యం కాదు. కాకపోతే, కొందరు ప్రీలాంచుల్లో చదరపు అడుక్కీ రూ.3000 నుంచి రూ.4000కు ఫ్లాట్లను కొన్నారు. ఆర్థిక మాంద్యం, తాజా కరోనా హెచ్చరిక నేపథ్యంలో మార్కెట్ మెరుగయ్యే అవకాశం కనిపించట్లేదు. ఈ తరుణంలో ప్రీలాంచుల్లో కొన్నవారు.. తాము కొన్న రేటుకు అటుఇటుగా.. ఫ్లాట్లను అమ్మకానికి పెట్టొచ్చు.
ఫలితంగా, ఆయా సంస్థ అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కేవలం నార్సింగి ప్రాజెక్టులోనే కాదు.. నగరం నలువైపులా.. ప్రీలాంచులు చేసిన కొందరు బిల్డర్లు.. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించిన సంస్థలు ఎప్పటికైనా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. ప్రీలాంచుల వల్ల ఆయా కంపెనీకే కాదు.. రెరా ప్రకారం ముందస్తు చేయకుండా అమ్మే సంస్థలకూ ఇబ్బందే. కాబట్టి, ఇప్పటికైనా నిర్మాణ సంస్థలు ప్రీలాంచుల్ని ప్రోత్సహించి.. తమ గోతిని తామే తవ్వుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక సంస్థలు అమ్మకాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రీలాంచుల్లో కొన్నవారు తక్కువ రేటుకు ఫ్లాట్లను విక్రయించడం వల్ల అసలుకే మోసం వస్తుంది.
కాబట్టి, తెలివైన ప్రమోటర్లు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎందుకంటే, ఒక డెవలపర్ ఐదు వందల ఫ్లాట్ల ప్రాజెక్టులో 100- 200 ఫ్లాట్లను ప్రీలాంచులో విక్రయించినా.. మిగతా 300 ఫ్లాట్లను మార్కెట్ రేటు ప్రకారమే విక్రయించాలి. లేకపోతే ఆయా ప్రాజెక్టులో నష్టం ఏర్పడుతుంది. రెండు వందల ఫ్లాట్లను మంచి ధరకు ఇప్పటికే అమ్మేసినా.. మిగిలి ఉన్న వంద ఫ్లాట్లను తాజా పరిస్థితుల వల్ల ఆలస్యమైతే.. అదే సమయంలో ప్రీలాంచ్ బయ్యర్లు ఫ్లాట్లను అమ్మకానికి పెడితే అసలుకే మోసం వస్తుంది. తాజాగా, హైదరాబాద్‌లో కొన్ని సంస్థలు ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి, ప్రమోటర్లు ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మకపోవడమే అన్నివిధాల శ్రేయస్కరం.