poulomi avante poulomi avante

నిర్మాణ రంగం ఎందుకు పుంజుకోలేదు?

Why Indian Realty Sector is not developed as expected in 2022?

  • 17 శాతం తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
  • రెసిడెన్షియల్ విభాగంలోనూ భారీ క్షీణత
  • వేర్ హసింగ్ మినహా అన్నింటా ఇదే పరిస్థితి
  • ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ పరిణామాలే కారణం
  • నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడి

కరోనా తర్వాత గాడిన పడి, మళ్లీ కాస్త కుదుపులకు లోనైన భారతీయ రియల్ ఎస్టేట్ రంగం ఇంకా పూర్తిగా పుంజుకోలేదు. అధిక ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన వడ్డీ రేట్లు, ప్రపంచ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఆశించినంత మేర ప్రైవేట్ ఈక్విటీ పెట్టబడులు రాలేదు. 2022లో 5.1 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం తక్కువ. ఈ విషయాలను నైట్ ఫ్రాంక్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021 మొదటి తొమ్మిది నెలల్లోనే 5.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కానీ ఈ ఏడాది అన్ని విభాగాల్లో తగ్గుదల నమోదైంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ అశాంతి వంటివన్నీ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు తగ్గడానికి కారణమయ్యాయి. ఇక 2022లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి కార్యాలయ రంగం అత్యధికంగా 45 శాతం వాటా కలిగి ఉంది. దీని తర్వాత వేర్ హౌసింగ్ 37 శాతం, రెసిడెన్షియల్ 12 శాతం, రిటైల్ రంగం 6 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. మొత్తం పెట్టుబడుల్లో ముంబై అత్యధికంగా 41 శాతం పెట్టుబడులను పొందగా.. ఢిల్లీ 15 శాతం, బెంగళూరు 14 శాతం పెట్టుబడులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రెసిడెన్షియల్ లో సగం తగ్గాయ్..

2022లో రెసిడెన్షియల్ రంగం 594 మిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు పొందింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం తక్కువ కావడం గమనార్హం. 2021 మొదటి తొమ్మిది నెలల్లోనే ఏకంగా 1187 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. కరోనా సంవత్సరం 2020లో ఇది 368 మిలియన్ డాలర్లుగా ఉంది. అంతకు ముందు ఎన్నడూ ఇంత తక్కువ పెట్టుబడులు రాలేదు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. ఈ కారణంగానే పెట్టుబడుల్లో క్షీణత నమోదైంది. ఇక నివాస రంగంలో అత్యధికం ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు (87 శాతం) విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చినవే.

ఆఫీస్ రంగంలో ఇలా..

పెట్టుబడులకు సంబంధించి ఆఫీసు రంగం తన హవా కొనసాగించింది. ఈ ఏడాది 2.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పొందింది. గతేడాదితో పోలిస్తే ఇది 19 శాతం తక్కువ. ఇక ఈ ఏడాది పెట్టుబడుల్లో 66 శాతం పెట్టుబడులు రెడీగా ఉన్న ప్రాపర్టీలపై పెట్టగా.. 34 శాతం పెట్టుబడులు నిర్మాణంలో ఉన్న, కొత్త వాటిపై పెట్టారు. ఆఫీస్ రంగానికి సంబంధించి 6131 మిలియన్ డాలర్లతో ముంబై తొలి స్థానంలో ఉండగా.. 4633 మిలియన్ డాలర్లతో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. 3311 మిలియన్ డాలర్లతో ఢిల్లీ, 2081 మిలియన్ డాలర్లతో హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రిటైల్ రంగంలో భారీ తగ్గుదల..

రియల్ ఎస్టేట్ పెట్టుబడులు రిటైల్ రంగంలో ఈసారి భారీగా తగ్గాయి. ఈ ఏడాది కేవలం 303 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 63 శాతం తక్కువ. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లోనే 817 మిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఇక ఈ ఏడాది రిటైల్ పెట్టుబడుల్లో కొత్తవాటిపై 31 శాతం, నిర్మాణంలో ఉన్న వాటిపై 12 శాతం, రెడీగా ఉన్న వాటిపై 44 శాతం నమోదయ్యాయి. నగరాల వారీగా చూస్తే 1664 మిలియన్ డాలర్లతో ముంబై మొదటి స్థానంలో ఉండగా.. 512 మిలియన్ డాలర్లతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. 483 మిలియన్ డాలర్లతో పుణె మూడో స్థానంలో, 267 మిలియన్ డాలర్లతో చండీగఢ్ నాలుగో స్థానంలో, 197 మిలియన్ డాలర్లతో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉన్నాయి.

వేర్ హౌసింగ్ ఓకే..

లాజిస్టిక్, పారిశ్రామిక విభాగాల్లో పెట్టుబడులు బాగానే పెరిగాయి. ఈ ఏడాది 1.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. గతేడాదితో (1.3 బిలియన్ డాలర్లు) పోలిస్తే ఇది 45 శాతం ఎక్కువ. ఓవరాల్ గా చూస్తే.. కరోనా తర్వాత గాడిన పడిన రియల్ రంగం ఇటీవల పరిస్థితులతో కాస్త తగ్గి, ఇప్పుడు స్థిరంగా కొనసాగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ ఉద్రిక్తతలు ఈ ఏడాది పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపించాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles