అంటున్న పలువురు ప్రమోటర్లు
కొందరు బడా బిల్డర్లు ఎలా తయారయ్యారంటే.. ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా వేసినా ఫర్వాలేదు.. బయ్యర్ల నుంచి చదరపు అడుక్కీ రెండు వందలు ఎక్కువ వసూలు చేసి.. టీఎస్ రెరాకు చెల్లిస్తామన్నట్లుగా తయారయ్యారు. ప్రీలాంచుల్లోనే ఈ జరిమానా మొత్తం కూడా ముందే బయ్యర్ల నుంచి వసూలు చేసేలా ప్రణాళికల్ని రచిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అందుకే, ప్రీలాంచులు చేసే బిల్డర్ల నుంచి కేవలం జరిమానా వసూలు చేసి వదిలేయకుండా.. శ్రీకృష్ణ జన్మస్థానానికి కూడా పంపించాలని.. అప్పుడే అలాంటి డెవలపర్లకు బుద్ధి వస్తుందని రియల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రెరా అనుమతి తీసుకోకుండా ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్న వారిలో చిన్న బిల్డర్ల నుంచి బడా డెవలపర్ల వరకూ ఉన్నారు. కేవలం తెలంగాణ బిల్డర్లే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నై, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు చెందిన బిల్డర్లు సైతం హైదరాబాద్‌లో ప్రీలాంచ్ వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. 2018 నుంచి పురుడుపోసుకున్న ఈ ప్రీలాంచ్ దందా.. కరోనా సమయంలో మరింత వేగం పుంజుకుంది. ఇందుకు గల కారణాల్ని విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్కెట్లోనేమో ఫ్లాట్ల ధరలు గణనీయంగా పెరిగాయి.
మరోవైపు కరోనా నేపథ్యంలో సొంతిల్లనేది అత్యవసరమైంది. ఈ నేపథ్యంలో ఏ బిల్డర్ రేటు తక్కువంటే.. వెనకా ముందు చూడకుండా అతని వద్ద కొనడం ఆరంభించారు. ధర తక్కువగా పెడితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ముందస్తుగా అడ్వాన్సు ఇస్తారనే విషయం అనేకమంది రియల్టర్లకు అర్థమైంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఇతర రంగాలకు చెందినవారు సైతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. అంతెందుకు, అనేకమంది స్థలయజమానులు సైతం డెవలపర్లుగా అవతారమెత్తారు. ఇలాంటి వారి వద్ద కొనుగోలు చేసిన వారిలో చాలామంది బయ్యర్లు ఆయా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
గత కొంతకాలం నుంచి స్తబ్దుగా ఉన్న టీఎస్ రెరాకు ఏమైందో తెలియదు కానీ.. కరెక్టుగా సార్వత్రిక ఎన్నికలు రెండు వారాలు ఉందనగా.. ఒక్కసారిగా పదమూడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు షోకాజ్ నోటీసును జారీ చేసింది. అంతేకాదు, పలువురు సంస్థల్లో పని చేసే రియల్ ఏజెంట్లకూ ప్రప్రథమంగా నోటీసునిచ్చింది. ఒకేసారి ఇంతమందికి నోటీసుల్ని జారీ చేయడంతో రియల్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రెరా నోటీసును అందుకున్న సంస్థల్లో ఒక బడా కంపెనీ పెద్దగా పట్టించుకోలేదట. రెరా గనక జరిమానా వేస్తే.. బయ్యర్ల నుంచి చదరపు అడుక్కీ మరో రూ.100 నుంచి 200 వసూలు చేసి కట్టేస్తామంటూ ఆయా సంస్థ ఉద్యోగులూ అంటున్నారట. దీంతో, చిర్రెత్తుకొచ్చిన పలువురు మార్కెట్ నిపుణులు.. ప్రిలాంచ్ చేసే సంస్థలకు గట్టిగా గుణపాఠం చెప్పాలని అంటున్నారు. భారీ జరిమానా కట్టడంతో పాటు ఆయా బిల్డర్లను శ్రీకృష్ణ జన్మస్థానానికి తప్పనిసరిగా పంపించాలని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా ఆయా బిల్డర్‌తో పాటు సంస్థను నిర్మాణాలు చేపట్టకుండా నిషేధించాలని సూచిస్తున్నారు.
టీఎస్ రెరా నుంచి నోటీసులు అందుకున్న సంస్థల్లో కొత్త రియల్ కంపెనీలతో బాటు బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి సంస్థలు ఉండటం గమనార్హం. ఈ సంస్థను మినహాయిస్తే.. టీఎస్ రెరా నోటీసు అందుకున్న సంస్థల జాబితా ఇలా ఉంది.
టీఎస్ రెరా పదమూడు సంస్థలు, నలుగురు ఏజెంట్లకు నోటీసుల్ని జారీ చేసింది. అయితే, వారు చెప్పే కాకమ్మ కథలు, కల్లిబొల్లి కబుర్లు విని వదిలివేయకూడదు. ప్రీలాంచులు చేసినట్లుగా సాక్షాధారాలున్న సంస్థలు, ఏజెంట్లపై తప్పకుండా జరిమానాను విధించాలి. లేకపోతే ఈ ప్రీలాంచ్ దందాకు రాష్ట్రంలో అడ్డుకట్ట పడదు. రెరా గనక ఇప్పటికైనా పూర్తిగా కళ్లు తెరవకపోతే, నొయిడా మరియు గుర్గావ్ తరహాలో.. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రజలు ఫ్లాట్లు కొని మోసపోయే ప్రమాదముంది. ఇప్పటికే తమ కష్టార్జితాన్ని తిరిగి రాబట్టుకోవడానికి పలు ప్రీలాంచ్ సంస్థల చుట్టూ కొనుగోలుదారులు తిరుగుతుండటం గమనార్హం. కాబట్టి, అమాయకుల కష్టార్జితాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత టీఎస్ రెరాపై ఉంది.
This website uses cookies.