Categories: TOP STORIES

మండువ ఇల్లంటే మ‌క్కువ

    • రియ‌ల్ ఎస్టేట్ గురుతో ప్రియాంక జ‌వాల్క‌ర్
    • టాక్సీవాలా సుంద‌రి సొంతింటి క‌బుర్లు
    • తిమ్మ‌ర‌సు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం
    • విజ‌యాల్నిఆస్వాదిస్తున్న ముద్దుగుమ్మ‌

సొంతిల్లు కొన‌డ‌మంటే ఆ అనుభూతియే వేరు. అలా చేతి వేలి తాక‌గానే.. మీదైన సొంత ప్ర‌పంచంలోకి అడుగుపెడితే ఎంతో ఆనంద‌మేస్తుంది. అందుకే, ఇంటికి గుండెకాయ లాంటి హాలును విశాలంగా, కాస్త ప్రామాణికంగా డిజైన్ చేసుకోవాల‌ని టాక్సీవాలా సుంద‌రీ ప్రియాంక జ‌వాల్క‌ర్ ( priyanka jawalkar ) భావిస్తోంది. మరి, తన కలల గృహం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వివ‌రాల్ని రియ‌ల్ ఎస్టేట్ గురుకి వివ‌రించింది. సారాంశం ఆమె మాట‌ల్లోనే..

లివింగ్ ఏరియా కాస్త ఎత్తుగా ఉండాలన్న‌ది నా ఆలోచ‌న‌. విశాల‌మైన కిటికీల్లో నుంచి స‌హ‌జ‌సిద్ధ‌మైన సూర్య‌కాంతి నేరుగా ఇంట్లో ప్ర‌సరించేలా.. సంప్ర‌దాయ రీతిలో ఇల్లు ఉండాలి. ఇప్పటికీ సాంస్కృతిక మూలాలతో ముడిపడి ఉన్న చాలా మందిలాగే, నేను కూడా సంప్రదాయా ప‌ద్ధ‌తిలోనే ఇల్లుండాల‌ని కోరుకుంటున్నా. పాత ప‌ద్ధ‌తుల్ని అనుస‌రిస్తూనే ఆధునిక విధానాల్ని అందిపుచ్చుకునేలా క‌ల‌ల గృహం ఉండాల‌ని ఆశిస్తున్నా. నేటిత‌ర‌ఫు ఫ్యాష‌న్ ను సంప్ర‌దాయ ప‌ద్ధ‌తితో మిళితం చేసిన గృహాలంటేనే నాకెంతో ఇష్టం.

వ‌ర్షం ప‌డితే ఇంట్లోనే..

త‌మిళ‌నాడులోని మండువ గృహాల్ని చూస్తే ఎంత ముచ్చ‌టేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ త‌ర‌హా గృహాలు ఆధునికంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు, వ‌ర్షం ప‌డితే నేటికీ ఇంటి మ‌ధ్య‌లోనే నీళ్లు ప‌డ‌తాయి. బ‌య‌ట ప‌చ్చ‌ద‌నం వెల్లివిరుస్తుంది. పెంపుడుకుక్క‌తో ఆడుకోవ‌డానికి స్థ‌లం ఉంటుంది. అతిపెద్ద వృక్షాలూ.. చుట్టూ ప్ర‌హారీ ఉంటుంది. కొత్త ఇళ్ల‌ల్లో మాత్రం అతిపెద్ద త‌లుపులు, అద్దాల‌తో త‌యారు చేసిన కిటికీలు, వంట చేసుకునేందుకు రాగి, మ‌ట్టి పాత్ర‌లుంటాయి. ఇలాంటి గృహాలంటే నాకెంతో ఇష్టం.

సొంతింటి విష‌యంలో నేటికీ పాత అల‌వాట్లు, ప‌ద్ధ‌తులంటే నాకెంతో ఇష్టం. కాక‌పోతే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటి డిజైన్‌ను మార్చుకోవాల‌ని భావిస్తాను. నేటికీ, చూడ‌టానికి భిన్నంగా క‌నిపించే మండువా గృహాలంటేనే మక్కువ. 1950 నుంచి ఈ త‌ర‌హా మండువ గృహాలున్నాయి. ఇవి కాస్త పెద్ద సైజు కుటుంబాల‌కు చ‌క్క‌గా స‌రిపోతాయి.

(బాక్స్‌) రెండు సినిమాలూ..

గ్రామీణ ప్రాంతాల్లో క‌నిపించే మండువ గృహాలు తిమ్మ‌ర‌సు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం చిత్రాల‌ హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ కు ఎంతో ఇష్టం. ఈ రెండు చిత్రాల విజ‌యాన్ని ఆమె ఆస్వాదిస్తోంది. త‌ను చెబుతున్న మండువ ఇల్లు.. మ‌న వ‌ద్ద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ప‌లు జిల్లాలో ఈ త‌ర‌హా గృహాలు స‌ర్వ‌సాధార‌ణంగా క‌నిపిస్తాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా, తూర్పు మ‌రియు ప‌శ్చిమ గోదావ‌రి, గుంటూరు, నెల్లూరు, విజ‌య‌న‌గ‌రం, క‌డ‌ప వంటి ప్రాంతాల్లో దర్శస్తాయి. తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈ త‌ర‌హా ఇళ్లు నేటికీ ఉన్నాయి. మెద‌క్, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం వంటి జిల్లాల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి.

This website uses cookies.