తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యధిక జనాభా గల జిల్లాల్లో మేడ్చల్-మల్కాజిగిరి ప్రముఖంగా నిలుస్తుంది. దీన్ని విస్తీర్ణం.. దాదాపు 1084 చదరపు కిలోమీటర్లు ఉండగా.. సుమారు పాతిక లక్షల మంది జనాభా కలిగి ఉంటుంది. కొత్తగా నాలుగు కార్పొరేషన్లు, పదమూడు మున్సిపాలిటీలున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పట్టణ జనాభా దాదాపు 91.4 శాతం. మరి, పట్టణాభివృద్ధిలో ఇంత కీలకమైన జిల్లాకు కొత్తగా మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్‌కు అదనపు బాధ్యతల్ని అప్పగించారు. తను డైనమిక్ ఆఫీసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, ధరణి సమస్యలు.. కలెక్టర్లకు అనుమతులకు సంబంధించిన పూర్తి బాధ్యతల్ని అప్పగించిన నేపథ్యంలో.. రెండు జిల్లాలకు ఏకకాలంలో పని చేయడం కష్టమే.
మేడ్చల్- మల్కాజిరిగి జిల్లాలో గత కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఇటు సిద్దిపేట్ సరిహద్దు నుంచి అటు యాదాద్రి వరకూ విస్తరించిన ఈ జిల్లాలో ఎక్కడ ఎలాంటి ప్రభుత్వం కార్యక్రమం జరిగినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారు. పని చేసేవారిని ఆయన ప్రోత్సహించారనే పేరుంది. రాత్రింబవళ్లు జిల్లాలో కష్టించి పని చేశారని అక్కడి ఉద్యోగులు నేటికీ చెప్పుకుంటారు. అదేంటో కానీ, ఒక్కసారిగా ఆయన్ని అక్కడ్నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. హైదరాబాద్ కలెక్టర్ అయిన శ్వేతా మహంతికి అదనపు బాధ్యతల్ని అప్పగించింది.
పని భారం పెరిగో.. మరేంటో తెలియదు కానీ తను ఏడాది కాలం పాటు ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇంత పెద్ద జిల్లాకు ఫుల్ టైమ్ కలెక్టర్ ఇస్తారని భావిస్తే.. మళ్లీ జిల్లా వాసులకు నిరాశే ఎదురైంది. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్‌కు అదనపు బాధ్యతల్ని అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టడం కష్టమే. ఎందుకంటే?
కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. మున్సిపల్ అధికారాలన్ని జిల్లా కలెక్టర్‌కు కేటాయించారు. లేఅవుట్లు, అపార్టుమెంట్లకు అనుమతి కూడా ఎప్పటికప్పుడు అందజేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుమతులతో బాటు ధరణీ పోర్టల్, రెవెన్యూ వంటి ప్రభుత్వ శాఖలతో నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయి. అక్రమ నిర్మాణాల్ని అరికట్టేందుకు.. వారిని ఎప్పటికప్పుడు కూల్చివేసే బాధ్యతలూ జిల్లా కలెక్టర్‌వే. మరి, ఇందుకోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలి. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రభుత్వం నిర్దేశించే ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇవన్నీ ఇంత పెద్ద జిల్లాలో చేయాలంటే.. పూర్తి స్థాయి జిల్లా కలెక్టర్ ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే ఉత్తమం అని చెప్పొచ్చు.
This website uses cookies.