Categories: TOP STORIES

లక్ష ఇళ్లు అమ్ముడుపోలేదు

  • హైదరాబాద్ లో పెరుగుతున్న ఇళ్ల నిల్వలు
  • ప్రాప్ ఈక్విటీ నివేదికలో వెల్లడి

హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దాదాపు లక్ష ఇళ్లు అమ్ముడుపోలేదు. ఈ త్రైమాసికంలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 5 శాతం పెరిగి 99,989 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తొమ్మిది ముఖ్య పట్టణాల్లో 1,22,213 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు నూతన సరఫరా 1,10,468 యూనిట్లుగా నమోదైంది. దీంతో మొత్తం మీద అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు తగ్గినట్టు నివేదిక పేర్కొంది. తొమ్మిది నగరాల్లో అమ్ముడుపోని యూనిట్లు 2 శాతం తగ్గి 5,15,169 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికం చివరికి వీటి సంఖ్య 5,26,914 యూనిట్లుగా ఉంది. టైర్‌-1 పట్టణాల్లో అత్యధికంగా థానేలో విక్రయం కాని ఇళ్ల నిల్వలు 21 శాతంగా (1,07,179 యూనిట్లు) ఉన్నాయి. మార్చి చివరికి ఉన్న 1,09,511 యూనిట్లతో పోలిస్తే 2 శాతం తగ్గినట్టు నివేదిక వివరించింది.

ముంబై విషయానికి వస్తే.. అమ్ముడుపోని ఇళ్లు 3 శాతం తగ్గి 60,911 యూనిట్లుగా నమోదయ్యాయి. మార్చి చివరికి ఇవి 62,735 యూనిట్లుగా ఉండడం గమనార్హం. నవీ ముంబైలో మాత్రం 31,735 యూనిట్ల నుంచి 32,997 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీలో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 26 శాతం తగ్గి 42,133 యూనిట్లుగా నమోదైంది. చెన్నైలో వీటి సంఖ్య 18 శాతం తగ్గి 19,900 యూనిట్లుగా ఉంది. పుణెలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు జూన్‌ త్రైమాసికం చివరికి 9 శాతం పెరిగి 75,905 యూనిట్లకు చేరాయి. బెంగళూరు మార్కెట్లోనూ అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 4 శాతం పెరిగి 52,208 యూనిట్లుగా నమోదు కాగా, కోల్‌కతాలో 20 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి.

This website uses cookies.