రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం రియల్ రంగంపైనా పడింది. వివిధ పార్టీల నేతలు తమ ప్రచారం కోసం నిర్మాణ కార్మికులను తీసుకెళ్తుండటంతో నిర్మాణాల జోరు తగ్గింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం జనం అవసరం. ఈ నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్న నిర్మాణ కార్మికులను వినియోగించుకుంటున్నారు. వారికి దినసరీ వేతనం చెల్లించి ప్రచారానికి తీసుకెళ్తున్నారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు చాలా చోట్ల నిలిచిపోయాయి. దీంతో పలువురు బిల్డర్లు బీహార్, యూపీ, జార్ఖండ్ నుంచి వచ్చిన వలస కూలీలతో పనులు చేయించుకుంటున్నారు. నిర్మాణ కార్మికులను ప్రచారానికి వినియోగించుకుంటుండటంతో నగరంలో గత 10 రోజులుగా నిర్మాణ కార్యకలాపాలు తగ్గాయని చెబుతున్నారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక, సిమెంటు, ఇటుకల వంటివి కష్టపడి మోస్తే తమకు వచ్చేది రూ.800 మాత్రమేనని.. ఒక్కోసారి కాంట్రాక్టర్లు రూ.600 లేదా రూ.700 ఇచ్చి సరిపెడతారని.. కానీ రెండు మూడు గంటలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే రూ.500 ఇస్తున్నారని నిర్మాణ కార్మికులు చెబుతున్నారు. రోజుకు రెండు మూడు ర్యాలీల్లో పాల్గొంటున్నామని.. తమకు ప్రస్తుతం ఇదే బాగుందని, ప్రచారం పూర్తయ్యే వరకు నిర్మాణ పనులకు వెళ్లబోమని స్పష్టంచేస్తున్నారు. కాగా, హైదరాబాద్ లో రియల్ రంగంపై ఆధారపడి దాదాపు 4 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని అంచనా.
This website uses cookies.