Categories: TOP STORIES

ఇళ్ల అమ్మకాలు మళ్లీ డౌన్

  • హైదరాబాద్ లో సెప్టెంబర్ త్రైమాసికంలో 19 శాతం తగ్గదల
  • దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 5 శాతం క్షీణత
  • ప్రాప్‌టైగర్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్ రియల్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మళ్లీ తగ్గాయ్. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మన భాగ్యనగరంలో గృహ విక్రయాలు 19 శాతం తగ్గగా.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 5 శాతం క్షీణత నమోదైంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 96,544 యూనిట్ల విక్రయాలు నమోదు కాగా, గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,01,221 యూనిట్లుగా ఉ‍న్నాయి. కొత్త ఇళ్ల సరఫరా కూడా సెప్టెంబర్‌ త్రైమాసికంలో 25 శాతం తక్కువగా 91,863 యూనిట్లుగానే ఉన్నాయని రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ తన తాజా నివేదికలో పేర్కొంది.

కొత్త ఇళ్ల సరఫరా తగ్గడం, ధరలు పెరగడమే అమ్మకాలు తగ్గడానికి కారణమని తెలిపింది. ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరగడంతో అమ్మకాలపై ప్రభావం పడినట్టు విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ కాలంలో హైదరాబాద్‌లో 11,564 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 14,191 యూనిట్లుగా ఉన్నాయి. అంటే 19 శాతం క్షీణత కనిపిస్తోంది. బెంగళూరులోనూ 11 శాతం తక్కువగా 11,160 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.

చెన్నైలో 8 శాతం తక్కువగా 3,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2,796 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలం అమ్మకాలతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో అమ్మకాలు ఒక శాతం తక్కువగా 30,010 యూనిట్లుగా నమోదయ్యాయి. పుణెలోనూ విక్రయాలు 3 శాతం తగ్గి 18,004 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో మాత్రం ఇళ్ల అమ్మకాలు 29 శాతం పెరిగి, 10,098 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 7,800 యూనిట్లుగా ఉన్నాయి.

అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 9 శాతం క్షీణించి 9,352 యూనిట్లుగా నమోదయ్యాయి. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో ఇళ్ల ధరలు కొన్ని ప్రాంతాల్లో 3 శాతం నుంచి 50 శాతం వరకూ పెరిగాయని, ఇది తక్షణ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోందని ప్రాప్‌టైగర్‌ బిజినెస్‌ హెడ్‌ వికాస్‌ వాధ్వాన్‌ వివరించారు. దేవీ నవరాత్రులతో పండుగల సీజన్‌ ఊపందుకుందని, అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు.

This website uses cookies.