Categories: TOP STORIES

వానాకాలం.. జర భద్రం

నిర్మాణ ప్రదేశాల్లో పలు జాగ్రత్తలు తప్పనిసరి

రాష్ట్రంలోకి వచ్చేవారం రుతపవనాలు ప్రవేశిస్తాయి. అంటే వానలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా బిల్డర్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలాచోట్ల పాత భవనాల గోడలు కూలిపోయాయి. అలాగే నిజాంపేటలో ఓ ప్రహరీ కూలి ఏడుగురు కూలీలు మృత్యువాత పడ్డారు.

అందువల్ల ఈ వర్షాకాలంలో అటు ప్రమాదాలు జరగకుండా, ఇటు నిర్మాణ కూలీలు వ్యాధులబారిన పడకుండా బిల్డర్లు చర్యలు చేపట్టాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో తవ్వకం పనులు చేపట్టకుండా ఉండటం మంచిదంటున్నారు. ఇలా చేయడం వల్ల నిర్మాణ స్థలంలోనే కాకుండా దానికి చుట్టపక్కల ఉన్న ప్రాపర్టీలు కూడా సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే సైట్లలో దోమలు వృద్ది చెందకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇందుకోసం నిర్మాణ ప్రదేశాలు, చుట్టుపక్కలు నీరు, చెత్త పేరుకుపోకుండా చూడాలని హెచ్చరిస్తున్నారు. నిర్మాణ ప్రదేశాలలో పనిచేసే కార్మికులకు తరచుగా రక్తపరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. అలాగే వారు నివసించే ప్రదేశాల్లో పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. అలాగే తాత్కాలిక నిర్మాణాలు, ట్రాన్సిట్ క్యాంపులు, హోర్డింగులు, సైట్ బారికేడ్లు, టవర్ క్రేన్లు, స్టీల్ నిర్మాణాలు, పార్కింగ్ ఏర్పాట్ల వంటివి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు.

ఆయా పనులన్నీ రిజిస్టర్డ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ సూచనల మేరకే చేపట్టాలని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దీనికి సంబంధించి అన్ని చర్యలూ చేపట్టింది. నిర్మాణ ప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంచేస్తూ సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైదరాబాద్ లో కూడా సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని.. వర్షాకాలంలో నిర్మాణ ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకునేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని పలువురు కోరుతున్నారు.

This website uses cookies.