Categories: TOP STORIES

రియాల్టీకి గుడ్ న్యూస్‌.. మేలో పెరిగిన ప్రాజెక్ట్ ప‌ర్మిష‌న్స్‌

హైద‌రాబాద్ రియ‌ల్ రంగం గేరు మార్చి మ‌ళ్లీ అభివృద్ధి దిశ‌గా ప‌య‌నిస్తుందా అంటే ఔన‌నే గణాంకాలు చెబుతున్నాయి. అధిక శాతం బిల్డ‌ర్లు బ‌డా ప్రాజెక్టుల్ని నిర్మించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మ‌న మార్కెట్‌కు గ‌ల సానుకూల‌త‌ల్ని దృష్టిలో పెట్టుకుని.. ఎప్ప‌టికైనా ఈ రంగానికి త‌గ్గ‌ద‌నే న‌మ్మ‌కంతో.. కొత్త నిర్మాణాల్ని మొద‌లెట్ట‌డానికి ముందుకొస్తున్నారు. ప్ర‌స్తుతం కొంత‌కాలం పాటు నిర్మాణ ప‌నుల మీద దృష్టి పెడితే.. ఆత‌ర్వాత అమ్మ‌కాలు ఆటోమెటిగ్గా జ‌రుగుతాయ‌ని ప‌లువురు బిల్డ‌ర్లు భావిస్తున్నారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో 2024 మే నెల‌లో మంజూరైన నిర్మాణాల్ని చూస్తే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఈ గ‌ణాంకాల్ని చూస్తే.. మ‌న న‌గ‌ర రియాల్టీ జూలు విదిల్చుకుని.. అభివృద్ధి దిశ‌గా ప‌య‌నిస్తుంద‌ని చెప్పొచ్చు. వివ‌రాల్లోకి వెళితే..

2024 మే నెల‌లో హెచ్ఎండీఏ సుమారు మూడు వంద‌ల ప్రాజెక్టుల‌కు అనుమ‌తుల్ని మంజూరు చేసింది. ఇవ‌న్ని క‌లిపి దాదాపు 141.73 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మాణాల్ని చేప‌డుతున్నాయి. ఇందులో ప‌లు బ‌డా ప్రాజెక్టులూ ఉండ‌టం విశేషం. గ‌త నెల‌లో మంజూరైన అనుమ‌తుల్ని చూసి.. పుర‌పాల‌క శాఖ అధికారులే ఆశ్చ‌ర్య‌పోయార‌ని చెప్పొచ్చు. అదే ఏప్రిల్ నెల‌లో 28 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల మేర‌కు అనుమ‌తుల్ని మంజూరు చేయ‌గా.. మార్చిలో 33 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ అనుమ‌తిని మంజూరు చేసింది. మొత్తానికి, హైద‌రాబాద్లో కొత్త నిర్మాణాల కోసం ప‌ర్మిష‌న్లు తీసుకునేవారిని చూస్తే.. మార్కెట్ మ‌ళ్లీ అభివృద్ది ప‌థంలోకి వెళ్లేందుకు అవ‌కాశ‌ముంద‌ని చెప్పొచ్చు. హైద‌రాబాద్ రియ‌ల్ రంగం అభివృద్ధి చేసేందుకై రాష్ట్ర ప్ర‌భుత్వం కృత‌నిశ్చయంతో ఉంద‌ని పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ దాన‌కిశోర్ రియ‌ల్ ఎస్టేట్ గురుకి తెలిపారు.

This website uses cookies.