రంగురంగుల దారులు.. సంప్రదాయమైన కోటలు.. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు.. ఇవీ రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ లోని దృశ్యాలు. ఇవన్నీ ఈ పింక్ సిటీని రాయల్ వెడ్డింగ్ కు గమ్యస్థానంగా నిలిపాయి. అటు సంస్కృతి సంప్రదాయాలు, ఇటు రాచరికపు హుందాతనాన్ని కళ్లకు కట్టినట్టు ఉండే కోటలు.. విశాలమైన తోటలు వెరసి వివాహ వేడుకలకు ప్రధాన కేంద్రంగా జైపూర్ ను మార్చేశాయి. దీంతో రాజస్థాన్ ఏటా సగటును 15 లక్షల నుంచి 20 లక్షల వరకు పెళ్లిళ్లకు వేదికగా నిలుస్తోంది.
సంప్రదాయ విలువలతో ప్రీమియం అనుభవాన్ని అందించే వేదికల కోసం చూస్తున్న జంటలు జైపూర్ నే ఎంచుకుంటున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్ గా జైపూర్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరిగింది. ఆతిథ్యరంగం, ఈవెంట్ మేనేజ్ మెంట్ విభాగాల్లో లాభదాయకమైన అవకాశాలు వెతుకుతున్న ఇన్వెస్టర్లు పెరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ వాణిజ్య, రెసిడెన్షియల్ విభాగాలకు డిమాండ్ పెరుగుతోంది. హోటల్ పరిశ్రమకు మించి వివాహ గమ్యస్థానంగానే జైపూర్ జనాదారణ పొందడంతో రవాణా, ఈవెంట్ ప్లానింగ్, క్యాటరింగ్ సహా అనేక అనుబంధ పరిశ్రమలు లబ్ధి పొందుతున్నాయి. సంప్రదాయ రాజస్థానీ అలంకరణలు, అలంకారాలకు డిమాండ్ పెరుగుతుండటంతో స్థానిక కళాకారులు, హస్త కళాకారులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది. ఉదయ్ పూర్, జైపూర్, జోథ్ పూర్, సిమ్లా, ముస్సోరి, హేవలాక్ దీవుల వంటి కొన్ని ప్రదేశాలు డెస్టినేషన్ వెడ్డింగ్ కు అత్యంత ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నాయి. అద్భుతమైన ఆరావళి పర్వతాలు, నిర్మలమైన వాతావరణం వంటి అంశాలు జైపూర్ ను ఈ విషయంలో అగ్రగామిగా నిలుపుతున్నాయి. దీంతో రియల్ రంగం అభివృద్ది పథంలో దూసుకెళ్తోంది. ఫలితంగా చాలామంది రియల్టర్లు ఇక్కడ వాణిజ్య అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు.
This website uses cookies.