-
- హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మార్ లో కీలక సాక్షి రంగారావు
ఎమ్మార్ కుంభకోణంలో తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఈ వ్యవహారంలో కీలక సాక్షిగా ఉన్న స్టైలిష్ హోమ్స్ ఎండీ తుమ్మల రంగారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ తనను నిందితుడిగా పేర్కొనకపోయినప్పటికీ, ఈడీ తనను నిందితుడిగా పేర్కొందని తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని, దీనిని కొట్టివేయాలని కోరారు. గచ్చిబౌలి, మణికొండ, నానక్ రామ్ గూడల్లోని 535 ఎకరాల్లో విల్లాలు కట్టి విక్రయించేందుకు దుబాయ్ కి చెందిన ఎమ్మార్ కంపెనీతో అప్పటి ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
అనంతరం ఆ ఫ్లాట్లను స్టైలిష్ హోమ్స్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా ఆ ఫ్లాట్లను విక్రయించాలని ఒప్పందం కుదిరింది. వంద ఫ్లాట్లను చదరపు గజం రూ.5వేలకు విక్రయించాలని.. కొనుగోలుదారుల నుంచి 4 శాతం కమీషన్ వసూలుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే, చదరపు గజాన్ని రూ.50వేల వరకు విక్రయించారు. అదనపు మొత్తాన్ని నగదుగా తీసుకుని మొత్తం రూ.96 కోట్లు వసూలు చేశారు. అలా వసూలు చేసిన మొత్తాన్ని ఈ కేసులో సీబీఐ కీలకంగా పేర్కొన్న కోనేరు రాజేంద్రప్రసాద్ కుమారుడు కోనేరు మధుకు చెందిన ఖాతాల్లో జమ చేశారు.
అనంతరం ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ తొలుత తుమ్మల రంగారావును నిందితుడిగా ఫేర్కొంది. అయితే, దర్యాప్తు సమయంలో అప్రూవర్ గా మారడంతో సీబీఐ ఆయన్ను సాక్షిగా చేర్చింది. మేజిస్ట్రేట్ ముందు సాక్షిగా వాంగ్మూలం కూడా నమోదు చేశారు. అనంతరం సీబీఐ అభియోగపత్రం ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ.. రంగారావును నిందితుడిగా పేర్కొంది. దీంతో తనపై ఈడీ కేసు కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.