Categories: TOP STORIES

రేటు త‌గ్గించిన సుమ‌ధుర‌!

  • శంషాబాద్ ప్రాజెక్టులో ఆఫ‌ర్ ధ‌ర‌.. రూ.5,199 మాత్ర‌మే
  • వాస్త‌వానికి, అక్క‌డి మార్కెట్ ధ‌ర‌.. చ‌.అ.కీ. రూ.6000
  • కొనేవారు త‌గ్గిపోయినందుకు ఈ ఆఫ‌రా?
  • నిర్మాణ ప‌నులకు అవ‌స‌ర‌మ‌య్యే సొమ్ము కోస‌మా?

హైద‌రాబాద్ మార్కెట్లో ఫ్లాట్ల అమ్మ‌కాలు త‌గ్గుముఖం ప‌ట్టాయా? అందుకే, కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు మార్కెట్ రేటు కంటే త‌క్కువ‌కు ఫ్లాట్ల‌ను అమ్ముతున్నారా? సుమ‌ధుర సంస్థ తాజా ప్ర‌క‌ట‌న చూస్తే.. బ‌డా బిల్డ‌ర్లు సైతం రేట్ల‌ను త‌గ్గించి విక్రయిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే..

సుమ‌ధుర సంస్థ శంషాబాద్ శాతంరాయిలో ఒక గేటెడ్ క‌మ్యూనిటీని ప్రారంభించింది. రెరా అనుమ‌తి కంటే ముందే ఈ సంస్థ ఇందులో ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించింది. ఏదైనా ఒక సంస్థ‌.. రెరా అనుమ‌తి లేకుండా ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తే.. తెలంగాణ రెరా చ‌ట్టం ప్ర‌కారం ఆయా ప్రాజెక్టులో ప‌ది శాతం జ‌రిమానాను విధిస్తారు. అటు కొనుగోలుదారుల‌కు ఇటు పెట్టుబ‌డిదారుల‌కు త‌క్కువ రేటుకు ఫ్లాట్ల‌ను విక్ర‌యించిన త‌ర్వాత‌.. అనుమ‌తి కోసం ఎలాగూ రెరా అథారిటీ వ‌ద్ద‌కు వెళ్లాల్సిందే. అప్ప‌టికే ప్రీలాంచ్లో ఈ సంస్థ ఫ్లాట్ల‌ను విక్రయించింద‌నే విష‌యం రెరా అథారిటీకి తెలిసిన‌ప్ప‌టికీ.. ప‌ది శాతం జ‌రిమానాను వ‌సూలు చేయ‌కుండానే.. శాతంరాయి ప్రాజెక్టుకి రెరా అనుమ‌తిని మంజూరు చేసింది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇదే సంస్థ తాజాగా శంషాబాద్‌లో ఆరంభించిన గార్డెన్స్ బ్రూక్ ప్రాజెక్టులో మొద‌టి యాభై క‌స్ట‌మ‌ర్ల‌కు మార్కెట్ రేటు కంటే త‌క్కువ‌కు ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తోంది.

సుమ‌ధుర సంస్థ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన ఆఫ‌ర్ ని గ‌మ‌నిస్తే.. శంషాబాద్లో మార్కెట్ విలువ చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.6000 ఉంటే.. లాంచింగ్ ధ‌ర‌గా కేవ‌లం రూ.5,199కే విక్ర‌యిస్తోంది. అంటే, చ‌ద‌ర‌పు అడుక్కీ సుమారు ఎనిమిది వంద‌లు త‌క్కువ‌గా అమ్ముతోంద‌న్న‌మాట‌. కొనేవారు త‌గ్గిపోయినందుకు ఇలా అమ్ముతోందా? లేదా నిర్మాణ ప‌నులకు కావాల్సిన‌ సొమ్మును స‌మీక‌రించేందుకు రేటు త‌గ్గించి విక్ర‌యిస్తుందా? అని ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు చ‌ర్చించుకుంటున్నారు. ఏదీఏమైన‌ప్ప‌టికీ, త‌క్కువ ధ‌ర‌కైతే ఫ్లాట్ల‌ను అమ్ముతున్నారు. మరి, ఇదే బాట‌లో మ‌రెన్ని సంస్థ‌లు ప‌య‌నిస్తాయో తెలియాలంటే.. మ‌రికొంత‌కాలం వేచి చూడాల్సిందే.

This website uses cookies.