రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తే అందుబాటు ధరల ఇళ్లకు ఊతమిచ్చినట్టు అవుతుందని.. 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ ఇళ్ల కొనుగోలుదారులకు ఉపశమనం కలుగుతుందని జేఎల్ఎల్ తన తాజా నివేదికలో పేర్కొంది. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కీలకమైన వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతుందని జేఎల్ఎల్ నివేదిక అభిప్రాయపడింది. రెపో రేటు తగ్గింపుతో 2025 నాటికి ఢిల్లీ, బెంగళూరు మినహా మిగిలిన హౌసింగ్ మార్కెట్ల స్తోమత పెరుగుతుందని పేర్కొంది. కోల్ కతా అత్యంత అందుబాటు ధరల ఇళ్ల మార్కెట్ గా తన స్థానం కొనసాగిస్తుందని అంచనా వేసింది.
అలాగే ముంబై, పుణెలు కూడా ఈ విభాగంలో మంచి స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. 2024లో రెసిడెన్షియల్ అమ్మకాలు 3,05,000 నుంచి 3,10,000 యూనిట్లకు చేరుకుంటాయని అంచనా. 2025లో ఇది మరింత వృద్ధి చెందుతుందని జేఎల్ఎల్ పేర్కొంది. దాదాపు 3,50,000 యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ ఏడాది ముగిసేలోపు వడ్డీ రేట్ల తగ్గింపు ఎలా ఉన్నప్పటికీ, రాబోయే 12 నెలల్లో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సడలింపుతో రుణ వ్యయాలు తగ్గి, ఇళ్ల కొనుగోలుదారులు, డెవలపర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని నివేదిక పేర్కొంది. ధరల పెరుగుదలలో 2011 నుంచి చూస్తే.. హైదరాబాద్ 132 శాతం పెరుగుదలతో అగ్రస్థానంలో ఉండగా, బెంగుళూరు 116 శాతం, ఢిల్లీ 98 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఆదాయం విషయంలో, ముంబై అత్యధికంగా 189 శాతం వృద్ధిని సాధించింది. అదే కాలంలో పుణె 173 శాతం, హైదరాబాద్ 163 శాతం వృద్ధిని సాధించాయి.
This website uses cookies.