రియల్ ఎస్టేట్ కు కీలకమైన గమ్యస్థానంగా మన హైదరాబాద్ మారుతోంది. ఈ రంగంలో శరవేగంగా దూసుకెళ్తోంది. గతేడాది స్తిరాస్థి రంగంలో చక్కని పురోగతి సాధించిన భాగ్యనగరం.. 2024లో తదుపరి స్థాయికి వెళుతుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ముంబై, పుణెలతో హైదరాబాద్ కూడా మంచి వృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉపాధి విభాగంలో పెరుగుతున్న కార్పొరేటీకరణ రియల్ వృద్ధికి బాగా ఉపకరిస్తోంది. ఇటీవల కాలంలో బలమైన సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అలాగే హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగానికి తోడు.. అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉండటం దేశ, విదేశీ పెట్టుబడుదారులకు ఆకర్షణీయమైన నగరంగా మారింది.
ఐటీ, పారిశ్రామిక కారిడార్ విస్తరణ ఫలితంగా ఐటీ కారిడార్ తోపాటు పలు కీలక ప్రాంతాల్లో నివాసాలకు డిమాండ్ బాగా ఉంది. నిజానికి ఐటీలో హైదరాబాద్ ముందుకు దూసుకెళ్తోంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం 2022-23లో రాష్ట్రం ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో 31 శాతం వృద్ధి నమోదు చేసింది. దీంతో సహజంగానే పెట్టుబడిదారుల చూపు హైదరాబాద్ పై పడింది. పైగా ప్రాజెక్టు రోల్ అవుట్ కూడా బాగుండటం మరో సానుకూలమైన అంశం. 2020-21లో విక్రయం కాని ఇన్వెంటరీ 35వేల యూనిట్లకు పైగా ఉన్నప్పటికీ.. నగరం కొత్త ప్రాజెక్టుల విషయంలో ముందుంది. అలాగే అనుమతుల విషయంలో టీఎస్ ఐపాస్, ఐసీటీ వంటి విధానాలు రియల్ మార్కెట్ కు ప్రయోజనం చేకూర్చాయి. ప్రాజెక్టుల పూర్తి రేటు 74 శాతం ఉండటం విశేషం. అలాగే రాబోయే రెండు మూడేళ్లలో 1.3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు ఉంటాయని పరిశ్రమ అంచనా. ఈ అంశాలన్నీ 2024లో ప్రాపర్టీ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో వృద్ధిని పెంచుతాయని చెబుతున్నారు.
This website uses cookies.