రియల్ ఎస్టేట్ గురు సందేహాలు- సమాధానాలు
1) సార్.. ఆర్‌జే గ్రూప్ అని ఒక సంస్థ ఘట్‌కేసర్‌లోని యమ్నంపేట్‌లో చదరపు అడుక్కీ రూ.3,099కే ఫ్లాట్ అమ్ముతున్నారు. 7.5 ఎకరాల్లో 450కి పైగా గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ల ప్రాజెక్టు ఇది. ధర కూడా తక్కువగానే అనిపిస్తోంది. ఇందులో నేను ఫ్లాట్ కొనుగోలు చేయవచ్చా? కొనేటప్పుడు ఏయే అంశాలు పరిశీలించాలి?
– రాజేష్, పీర్జాదిగూడ
రాజేష్ గారు.. ఘట్‌కేసర్‌లో చదరపు అడుక్కీ మూడు వేల ఒక వంద మంచి రేటు అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల యావత్ భారతదేశంలోనే తెలంగాణ రియల్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. కాబట్టి, హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ రంగానికి మంచి గిరాకీ పెరుగుతోంది. ఇదే సమయంలో మీరు ఫ్లాటు కొనుగోలు చేసేటప్పుడు పలు అంశాలపై దృష్టి సారించాలి. అవేమిటంటే..
2) కొల్లూరులో ఐటీ పార్కు వస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ వార్త వచ్చిన తర్వాత కొందరు బిల్డర్లు రేటు పెంచేశారు. అసలీ పార్కు వస్తుందా? ఇప్పుడు ఫ్లాటు కొనడం ఉత్తమమా? కొంత కాలం వేచి చూడమంటారా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచి హైదరాబాద్‌లో కానీ వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాల్లో కానీ కొత్త ఐటీ పార్కులకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయే తప్ప వాటి వల్ల కొత్తగా యువతకు ఉద్యోగాలు వచ్చిన దాఖలాల్లేవు. అయితే, వరంగల్, కరీంనగర్ నగరాల్లో అందుకు సంబంధించిన నిర్మాణ పనులైతే ఆరంభమయ్యాయి. హైదరాబాద్‌లో బుద్వేల్, కొంపల్లి, లుక్ ఈస్ట్ పాలసీ అంటూ గత కొంతకాలంగా విపరీతమైన ప్రచారమైతే జరిగింది. ఆ ప్రచారం వల్ల ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు, ఆ తర్వాత ఫ్లాట్ల రేట్లు పెరిగాయే తప్ప.. యువతకు ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు కనిపించలేదు.
అంతెందుకు శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటయ్యే సమయంలో మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత హడావిడి జరిగిందో మీకు తెలియనిది కాదు. కొందరైతే భూముల్ని కొనేందుకు కార్లలో డబ్బుల సంచులతో తిరిగారనే ప్రచారమూ జరిగింది. అయితే, ఆతర్వాత కొన్నేళ్ల పాటు మహేశ్వరం స్తబ్దుగా మారింది. గత రెండు, మూడేళ్ల నుంచి అక్కడ కదలికలు ఆరంభమయ్యాయి.
3) సర్, పటాన్‌చెరు వద్ద ఒక సంస్థ చదరపు అడుక్కీ రూ.2500కే ఫ్లాట్లను విక్రయిస్తోంది. ముందే వంద శాతం సొమ్ము కడితేనే ఈ రేటుకు ఇస్తానని అంటోంది. అయితే, సొమ్ము తీసుకున్నాక ఆయా కంపెనీ ఎలాంటి రశీదు ఇవ్వదట. రెరా అథారిటీ నుంచి అనుమతి వచ్చాకే అగ్రిమెంట్ కూడా చేస్తుందట. మరి, నేను ఇందులో ఫ్లాటు కొనవచ్చా?- కిరణ్ కుమార్, భానూరు
స్థానిక సంస్థ, రెరా అథారిటీ నుంచి అనుమతి పొందాకే ఫ్లాటును కొనుగోలు చేయండి. మీరు చదరపు అడుక్కీ రూ..2500 చొప్పున డబుల్ బెడ్‌రూం ఫ్లాటు కొనుగోలు చేసినా..కార్ పార్కింగ్, ఇతరత్రా ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే.. ఎంతలేదన్నా ముప్పయ్ లక్షలు అవుతుంది. ఆయా నిర్మాణం పూర్తవ్వడానికి మూడేళ్లు పడుతుందని అనుకుందాం. అంటే, రూ.30 లక్షల మీద రెండు శాతం చొప్పున వడ్డీ లెక్కించినా.. నెలకు రూ.60 వేలు అవుతుంది. అంటే, మూడేళ్లలో రూ.21.60 లక్షలు అవుతుంది. అంటే, మీరు ఈ ఫ్లాట్ కోసం రూ.52 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ కరోనా మరోసారి విజృంభించి ఈ ప్రాజెక్టు మరో రెండేళ్లు ఆలస్యమైతే ఈ ఫ్లాట్ ఖర్చు రూ.65 లక్షలు దాటేస్తుంది. పైగా, ఆయా ప్రాజెక్టు ఆరంభమవుతుందో లేదో తెలియదు.. ఒకవేళ ఆరంభమైనా నాణ్యతగా కట్టిస్తాడా? లేదా? అనేది సందేహాస్పదమే. కాబట్టి, ఫ్లాటు కొనేటప్పుడు అన్నిరకాలుగా ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలి.