గతేడాది స్థిరమైన పురోగతిలో స్తిరాస్థి రంగం
2024లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందని అంచనా
రియల్ ఎస్టేట్ రంగం గతేడాది స్థిరమైన పనితీరు కనబరిచింది. ముఖ్యంగా రెసిడెన్షియల్ మార్కెట్లకు మంచి జోష్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం.. అనేకమంది కొనుగోలుదారులకు వారి కలల సౌధంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించింది. అలాగే రెపో రేటు మారకపోవడం కూడా ఇళ్ల అమ్మకాల జోరును పెంచడానికి సహాయపడింది. ఇదే జోరు 2024లో కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రియల్ పరిశ్రమం బలంగా ఉన్నందున 2024లో కొత్త ప్రాపర్టీ లాంచ్ లు 15 నుంచి 25 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే అమ్మకాల్లో కూడా 10 నుంచి 15 శాతం పెరుగుదల ఉండాలని చెబుతున్నారు. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై రియల్ రంగానికి కూడా చాలా కీలకమైనదని అంటున్నారు. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ పథకాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, అలాగే పీఎంఏవై కేటాయింపులు పెంచాలని, గృహ రుణ వడ్డీకి సంబంధించి ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని రియల్ రంగం నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రెరాకు కొన్ని కీలక సంస్కరణలు చేయడం ద్వారా రియల్ రంగంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని అభిలషిస్తున్నారు.
కోవిడ్ తర్వాత పాతకాలం నాటి సవాళ్లకు వినూత్న పరిష్కారాలు అందిస్తూ సాంకేతికత అనేది రియల్ రంగంలో హీరోగా అవతరించింది. ప్రాప్ టెక్ స్వీకరణ ఊపందుకుంది. అలాగే ఏఐ ఆధారిత విశ్లేషణల నుంచి పారదర్శక, సురక్షితమైన లావాదేవీల కోసం బ్లాక్ చెయిన్ వరకు సాంకేతికత బాగా పెరిగింది. ఇది ఈ రంగంలో విశ్వాసానికి ఉత్ప్రేరకంగా మారింది. ఈ నేపథ్యంలో 2023లో రెసిడెన్షియల్ రియల్ మార్కెట్ బాగా పుంజుకుంది. స్మార్ట్ హోమ్స్, సుస్థిరమైన జీవనం అనేవి కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో అగ్రభాగాన నిలిచాయి. డెవలపర్లు కూడా పర్యావరణ అనుకూల విధానాలు అవలంభించడంతోపాటు హరిత భవన నిర్మాణ విధానాలను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం అటు సాంకేతికత, ఇటు స్థిరత్వం అనేవి రియల్ రంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా మారిపోయాయి.
ఇక 2024 రియల్ రంగానికి సవాళ్లు, అపూర్వమైన అవకాశాలతో కొత్త శకం ప్రారంభానికి చేరువలో ఉంది. డెవలపర్లక బలమైన వృద్ధి అవకాశాలను కొత్త సంవత్సరం తీసుకొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాల్లో పెరుగుదల నమోదైంది. అలాగే ప్లాటెడ్ డెవలప్ మెంట్లోనూ వృద్ధి కనిపించింది. ఫలితంగా మొత్తం అమ్మకాలు 2.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2024లో ఇది 3 లక్షలకు చేరుతుందని అంచనా. అలాగే కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా గణనీయంగా పుంజుకోవడానికి సిద్ధంగా ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడ కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. భూముల అధిక ధరలు, అనుమతులకు సంబంధించి సంక్లిష్ట నియమాలు, నిబంధనలు ప్రధాన అడ్డంకులగా మారాయి. అయినప్పటికీ, ఈ రంగం వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతుందని రియల్ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
This website uses cookies.