హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏప్రిల్ లో బాగానే పుంజుకుంది. నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లు బాగా నమోదయ్యాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. ఏప్రిల్ లో మొత్తం 4398 అపార్ట్ మెంట్లు రిజిస్టర్ అయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.2,230 కోట్లు. పెట్టుబడిదారులు, ఇళ్ల కొనుగోలుదారులకు హైదరాబాద్ హాట్ స్పాట్ గా మారిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ అయిన మొత్తం ఇళ్లలో రూ.25-50 లక్షల శ్రేణి గృహాలు 54 శాతం ఉండటం విశేషం. అంటే బడ్జెట్ బయ్యర్ల నుంచి లగ్జరీ అన్వేషకుల వరకు విభిన్న శ్రేణి కొనుగోలుదారులకు హైదరాబాద్ ఓ చక్కని చాయిస్ గా మారినట్టు అర్థమవుతోంది. కాగా, మొత్తం అమ్ముడైన ఇళ్లలో వెయ్యి నుంచి 2వేల చదరపు అడుగుల మధ్య ఇళ్లు 69 శాతం ఉన్నాయి.
హైదరాబాదీలు ఎక్కువ స్థలం, సౌకర్యాలతో కూడిన అప్ గ్రేడెడ్ ఇళ్ల కోసం చూస్తున్నారని అవగతమవుతోంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 47 శాతం, రంగారెడ్డి జిల్లాలో 38 శాతం, హైదరాబాద్ జిల్లాలో 14 శాతం నమోదయ్యాయి. అయితే, ఏప్రిల్ లో జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే.. ప్రాపర్టీ సగటు ధరలు 0.3 శాతం తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో హైదరాబాద్ లో అత్యధికంగా ధరల పెరుగుదల 9 శాతం నమోదు కాగా, మేడ్చల్-మల్కాజ్ గిరిలో ఇది రెండు శాతంగా ఉంది.