ప్రాజెక్టు ఆడిటర్లుగా పనిచేసిన ఆడిటర్లలో కొందరు నిబంధనలు ఉల్లంఘించడంపై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని ఆయా చార్టెడ్ అకౌంటెంట్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ వ్యవహారాన్ని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లింది. మహారాష్ట్ర రెరా నిబంధనల ప్రకారం ప్రమోటర్లు బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసినప్పుడు ప్రాజెక్టు ఆడిటర్ ధ్రువీకరించిన ఫామ్-3 సమర్పించాలి. అలాగే సదరు డెవలపర్ చట్టబద్ధ ఆడిటర్ లేదా అకౌంటెంట్ ధ్రువీకరించిన ఆడిట్ రిపోర్టును కూడా సమర్పించాలి. ఈ రెండింటిని వేర్వేరు అకౌంటెంట్లు లేదా సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండింటినీ ఒకే ఆడిటర్ ధ్రువీకరించినట్లు మహా రెరా గుర్తించింది. అంతేకాకుండా చార్టెడ్ అకౌంటెంట్లు పొందుపరిచిన యూడీఐఎన్ నంబర్లలో వ్యత్యాసాలు ఉన్నట్టు నిర్ధారించింది. ఇవి రెరా నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ రెండూ ఒకే ఆడిటర్ ఇస్తే.. డెవలపర్ ఏదో దాస్తున్నాడనే భావన కలుగుతుందని మహా రెరా అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా చార్టెడ్ అకౌంటెంట్లకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఈ విషయంలో ప్రమోటర్ల పాత్ర ఏమి ఉందో కూడా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.