హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నలభై నుంచి యాభై దాకా ఆకాశహర్మ్యాలు ఆరంభమయ్యాయి. అందులో అధిక శాతం డెవలపర్లు ఫ్లాట్లను విక్రయించారు. కొన్ని నిర్మాణాల్లో అరవై నుంచి డెబ్బయ్ శాతం దాకా అమ్ముడయ్యాయి. వీటిలో అధిక శాతం డెవలపర్లు రియల్ ఎస్టేట్ అభివృద్ధి యధావిధిగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ వస్తే రియల్ మార్కెట్ పడిపోతుందని కొందరు గోబెల్స్ ప్రచారాన్ని నిర్వహించారు. ఎలాగో తెలుసా?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ వ్యవహరించేవారు. ఈ మూడు విభాగాలకు సంబంధించి ఎలాంటి అంశమైనా ఆయన తక్షణమే నిర్ణయం తీసుకునేవారు. పాలనపరంగా సౌలభ్యముండేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు శాఖలకు ముగ్గురు మంత్రుల్ని నియమించే అవకాశముంది. కాబట్టి, విధానపరమైన నిర్ణయమైనా అభివృద్ధికి సంబంధించిన కొత్త పథకమైనా.. నిర్ణయాలు ఆలస్యమవుతుందని వాదించేవారి సంఖ్య ఎక్కువుండేది. ఇలాంటి కారణాల్ని చూపెడుతూ.. కాంగ్రెస్ పై కొందరు నెగటివ్ ప్రచారం చేసేవారు. కానీ, వాటన్నింటినీ తిప్పికొట్టి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. ఈ క్రమంలో కొత్తగా నిర్మితమవుతున్న ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం పడుతుందేమనని డెవలపర్లు కొంత ఆందోళనలో ఉన్న మాట వాస్తవమే. కాబట్టి, నిర్మాణ రంగానికి కొత్త ప్రభుత్వం భరోసా కలిగించాలి.