Categories: Uncategorized

ఇళ్ల ధరలు కొంచెం పెరిగాయి

  • హైదరాబాద్ లో స్వల్పంగా పెరిగిన గృహాల రేట్లు
  • అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పెరుగుదల
  • ఎనిమిది ప్రధాన నగరాల్లో 10 శాతం అధికం
  • క్రెడాయ్‌ – కొలియర్స్‌ – లైసస్‌ ఫొరాస్‌ నివేదిక

రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. హైదరాబాద్ లో ఇళ్ల ధరలు మాత్రం తగ్గలేదు. పైగా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్లో గృహాల రేట్లు గత అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో 2 శాతం పెరిగినట్టు క్రెడాయ్‌-కొలియర్స్‌-లైసస్‌ ఫొరాస్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగ్గా.. అత్యధికంగా ఢిల్లీలో 31 శాతం పెరుగుదల నమోదైంది.

పట్టణాల వారీగా చూస్తే.. హైదరాబాద్‌లో 2024 అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్‌లో ఇళ్ల ధరలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.11,351కి చేరింది. ఢిల్లీలో 31 శాతం ఎగసి 11,993కు చేరగా.. బెంగళూరులో 23 శాతం పెరిగి రూ.12,238గా ఉంది. అహ్మదాబాద్‌లో ధరలు 15 శాతం పెరగడంతో చదరపు అడుగు రూ.7,725కు చేరింది. చెన్నైలో 6 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.8,141గా ఉంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో ధరలు 3 శాతం పెరగడంతో చదరపు అడుగు ధర రూ.20,725కు చేరింది.

పుణెలో ఇళ్ల ధరలు 9 శాతం పెరిగి, చదరపు అడుగు రూ.9,982గా నమోదైంది. కోల్‌కతాలో అతి తక్కువగా ఒక శాతం ధర పెరగడంతో చదరపు అడుగు ధర రూ.7,971కి చేరింది. బలమైన డిమాండ్‌కుతోడు అధిక నిర్మాణ వ్యయాలు ధరలు పెరగడానికి కారణమని నివేదిక పేర్కొంది. వరుసగా 16వ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరలు పెరిగినట్టు తెలిపింది. విశాలమైన ఇళ్లు, మెరుగైన జీవనశైలికి ప్రాధాన్యం వంటివి హౌసింగ్‌ డిమాండ్‌ను పెంచినట్టు క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ తెలిపారు. నిర్మాణ వ్యయాలు, భూమి కొనుగోలు ధరలు పెరగడం ధరల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు.

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది కూడా ఇళ్ల ధరలు పెరుగుతాయని కొలియర్స్‌ ఇండియా సీఈవో బాదల్‌ యాగ్నిక్‌ అంచనా వేశారు. అందుబాటు ధరల ఇళ్లు, మధ్యస్థ ధరల విభాగంలో ఇళ్ల సరఫరా, విక్రయాలు రానున్న రోజుల్లో పెరగొచ్చని లైసస్‌ ఫొరాస్‌ ఎండీ పంకజ్‌ కపూర్‌ అభిప్రాయపడ్డారు. డిసెంబర్‌ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయని, కొత్త ఇళ్ల ఆవిష్కరణ ఓ మోస్తరుగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

This website uses cookies.