Categories: LATEST UPDATES

రిజిస్ట్రేషన్ భారం ఇంతింత కాదయా..

– భూముల మార్కెట్ విలువల పెంపుతో జనంపై భారీ భారం
– 103 శాతం నుంచి 181 శాతం మేర రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఓవైపు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం.. మరోవైపు భూముల మార్కెట్ విలువలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీల రూపేణా జనంపై భారం భారీగానే పడబోతోంది. ఏడు నెలల వ్యవధిలోనే భూముల మార్కెట్ విలువలను సర్కారు రెండో సారి పెంచడంతో సామాన్యులకు సొంతింటి కల మరింత కష్టమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జూలైలో భూముల మార్కెట్ విలువలు పెంచకముందు రిజిస్ట్రేషన్ చార్జీలకు, ప్రస్తుత ప్రతిపాది చార్జీలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కనీసం 103 శాతం నుంచి 181 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది.

– రూ.కోటి విలువైన విల్లా లేదా అపార్ట్ మెంట్ ను ఉదాహరణగా తీసుకుంటే 2021 జూలై 22కు ముందు దాని రిజిస్ట్రేషన్ చార్జీలు దాదాపు రూ.6 లక్షలు అయ్యేవి. తొలిసారి మార్కెట్ విలువలు పెంచిన తర్వాత ఆ విల్లా ఖరీదు రూ.1.30 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.9.75 లక్షలకు పెరిగాయి. అదే ప్రస్తుత ప్రతిపాదిత చార్జీలతో ఆ విల్లా ధర రూ.1.62 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ కోసం 12,18,750 వెచ్చించక తప్పదు. అంటే రిజిస్ట్రేషన్ చార్జీలు 103 శాతం పెరిగాయన్నమాట.

– అదే ఓపెన్ ప్లాట్ల విషయానికి వద్దాం. రూ.50 లక్షల విలువైన ప్లాట్ కు 2021 జూలైకి ముందు రూ.3 లక్షల రిజిస్ట్రేషన్ చార్జీ ఉండేది. తొలిసారి మార్కెట్ విలువల సవరణ త్వాత ఆ స్థలం విలువ రూ.75 లక్షలకు.. రిజిస్ట్రేషన్ చార్జీ రూ.5,62,500కి పెరిగింది. తాజా ప్రతిపాదనల ప్రకారం అయితే.. స్థల విలువ రూ.1,01,25,000కు, రిజిస్ట్రేషన్ చార్జీ రూ.7,59,375కి పెరిగింది. అంటే ఇక్కడ 153 శాతం పెరుగుదల నమోదైంది.

– రూ.కోటి విలువైన వ్యవసాయ భూమికి గతంలో రూ.6 లక్షల రిజిస్ట్రేషన్ చార్జీ ఉండేది. అనంతరం ఆ భూమి విలువ రూ.కోటిన్నరకు పెరగ్గా.. రిజిస్ట్రేషన్ చార్జీ రూ.11.25 లక్షలకు పెరిగింది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం భూమి విలువ 2.25 కోట్లకు పెరగ్గా.. రిజిస్ట్రేషన్ చార్జీలు ఏకంగా రూ.16,87,500 అయ్యాయి. ఇది ఏకంగా 181 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

This website uses cookies.