రియల్ ఎస్టేట్ రంగంలో ముంబై తన దూకుడు కొనసాగిస్తోంది. ఈ దీపావళి సీజన్లో రిజిస్ట్రేషన్ల ర్యాలీ జరిగింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్లో రిజిస్ట్రేషన్లలో 21 శాతం పెరుగుదల కనిపించింది. గతేడాది అక్టోబర్లో 9,736 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది అక్టోబర్లో 11,861 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే గతేడాది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.712 కోట్లు కాగా, ఈ ఏడాది అక్టోబర్లో 52 శాతం పెరిగి రూ.1,081 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఆగస్టులో 11,631 యూనిట్లు రిజిస్టర్ కాగా, సెప్టెంబర్లో 9,111 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో 2024 మూడో త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు తక్కువగానే ఉన్నాయని అనరాక్ వెల్లడించింది.
2024 క్యూ3లో 24,930 అమ్ముడయ్యాయి. 2023 క్యూ3తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం తక్కువ. అయితే, ప్రస్తుత విక్రయాల ట్రెండ్ ఇలాగే కొనసాగితే, ఈ పండుగ త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు) అధిక ధరలు ఉన్నప్పటికీ మునుపటి త్రైమాసికం కంటే ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉందని అనరాక్ చైర్మన్ అనూజ్ పూరి పేర్కొన్నారు. గత ఆరేళ్లలో దీపావళి నెలలో రిజిస్ట్రేషన్లు పరిశీలిస్తే.. 2024లో అత్యధికంగా 11,861 ఆస్తి రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. 2023లో, నవంబర్ దీపావళి నెలలో 9,736 ఆస్తులు రిజిస్టర్ కాగా, 2022లో 8,421; 2021లో 7,582; 2020లో 9,301; 2019లో 5,811 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి.
గత ఆరేళ్లలో దీపావళి నెలల్లో ఆస్తి రిజిస్ట్రేషన్ల డేటా, డిమాండ్ ట్రెండ్‌ల ను పరిశీలిస్తే.. 2024 అక్టోబర్ లో ఇళ్ల సగటు టికెట్ ధర రూ. 1.66 కోట్లుగా ఉంది. నవంబర్ 2020 దీపావళి నెలలో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో 9,301 ప్రాపర్టీలు అమ్ముడు కాగా, సగటు టికెట్ ధర రూ.1.03 కోట్లుగా ఉంది. కాగా, ఈ ఏడాది మొదటి పది నెలల్లో ముంబైలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు 1.15 లక్షల మార్కును దాటాయి. అలాగే ఆదాయం రూ.10వేల కోట్లు దాటింది.
This website uses cookies.