ఆస్తి రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జోరుగా వెళుతోంది. 2024 రెండో త్రైమాసికంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు రూ. 12 వేల కోట్లకు చేరుకుననాయని ప్రాప్ టెక్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2024 ఏప్రిల్-జూన్ కాలంలో హైదరాబాద్ ఆస్తి రిజిస్ట్రేషన్లు 11% పెరుగుదలతో 19,574 లావాదేవీలకు చేరుకున్నాయని వివరించింది. ఇంటి అమ్మకాల విలువ 27 శాతం పెరగ్గా.. లావాదేవీల సంఖ్య 4 శాతం పెరిగింది.
హైదరాబాద్‌లో సగటు నమోదిత గృహ విక్రయాల విలువ రూ.61 లక్షలకు చేరుకుంది. ఇది 15% వార్షిక వృద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఇక జూన్ త్రైమాసికంలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన ఆస్తుల లావాదేవీల వాటా 28 శాతానికి పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 21 శాతంగా ఉంది. అలాగే రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య ధర కలిగిన ప్రాపర్టీల లావాదేవీల వాటా 8 శాతం నుంచి 14 శాతానికి పెరిగింది. మరోవైపు కొనుగోలుదారులు ఖరీదైన ప్రాపర్టీల వైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక తెలిపింది. 2024 రెండో త్రైమాసికంలో దాదాపు 45 శాతం లావాదేవీలు 1,000-1,500 చదరపు అడుగుల మధ్య ఉన్న అపార్ట్ మెంట్ల కోసం జరిగాయి. అదే సమయంలో 1,500-2,000 చదరపు అడుగుల మధ్య ఉన్న వాటి కోసం 37 శాతం లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 31 శాతంగా ఉంది.
ఈ కాలంలో అమ్ముడైన మొత్తం ఇళ్ల విస్తీర్ణం 29 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం అధికం. ప్రాంతాలవారీగా చూస్తే జూన్ త్రైమాసికంలో నమోదైన మొత్తం గృహ లావాదేవీలలో 46% వాటా హైదరాబాద్ వెస్ట్ నివాస కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. హైదరాబాద్ ఈస్ట్ 15% షేర్‌ని కైవసం చేసుకుంది. అమ్మకాల విలువ పరంగా కూడా వెస్ట్ మైక్రో-మార్కెట్ 58% వాటాతో ఆధిపత్యం చెలాయించగా.. సెంట్రల్ హైదరాబాద్ 11 శాతం, ఈస్ట్ హైదరాబాద్ 10 శాతం వాటా కలిగి ఉన్నాయి.
This website uses cookies.