తెలంగాణ నిర్మాణ సంఘాలన్నీ కలిసికట్టుగా ఒక రోజు బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం సాయంత్రం దాకా తెలంగాణ నిర్మాణ సంఘాలన్నీ రోడ్డు మీదికొచ్చేశాయి. నెల రోజుల వ్యవధిలో నిర్మాణ సామగ్రి ధరలు దాదాపు పాతిక శాతం పెరగడాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అపార్టుమెంట్ల అనుమతులొచ్చాక ఫ్లాట్లను ఒక రేటుకు విక్రయిస్తామని.. ప్రాజెక్టు పూర్తవ్వడానికి ఎంతలేదన్నా రెండేళ్ల నుంచి నాలుగేళ్లు పడుతుందని.. ఈ సమయంలో ఇలా నిర్మాణ సామగ్రి రేట్లు పెరిగితే.. నిర్మాణం పూర్తి చేయడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. ఇలా భవన సామగ్రి రేట్లు పెరిగిన తర్వాత.. ఆయా నిర్మాణాల్ని పూర్తి చేయాలంటే కష్టమవుతుందన్నారు. అప్పటికే ఒక రేటుకు విక్రయించిన తర్వాత.. మళ్లీ వారి దగ్గర్నుంచి పెరిగిన రేటును వసూలు చేయడం కష్టమని అంటున్నారు. అందుకే, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని.. నిర్మాణ రంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రెరా నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత.. ఒక రేటుకు విక్రయించిన తర్వాత.. ఇంత భారీ స్థాయిలో నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం అన్యాయమని టీబీఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు మండిపడ్డారు. విద్యుత్తు, టెలిఫోన్ వంటి సంస్థల నియంత్రణకు ప్రత్యేకంగా రెగ్యులేటరీ అథారిటీని నియమించినట్లే.. సిమెంటు, స్టీలు వంటి ధరల్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా అథారిటీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఎవరికీ వ్యతిరేకంగా బంద్ నిర్వహించడం లేదని.. కేవలం తమ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకే తాజా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిర్మాణ సామగ్రి ధరల్ని విక్రయించే సంస్థలను దారిలోకి తేవాల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్రం రంగంలోకి దిగి.. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. సోమవారం జరిగిన బంద్ కార్యక్రమంలో టీబీఎఫ్‌కు చెందిన అనుబంధ సంఘాలన్నీ కలిసికట్టుగా పనుల్ని నిలిపివేశాయని.. బంద్‌ను విజయవంతం చేశారని తెలిపారు.